బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తరుషుల్లో ఒకడిగా ప్రసిస్థుడు. అష్ట ప్రకృతుల్లో అద్వితీయుడు.
వశిష్ఠునికి, విశ్వామిత్రుడికీ మధ్య విభేదాలు తల ఎత్తి ఒకరంటే మరొకరికి బొత్తిగా సరిపడకుండా పోయింది. ఒక రోజు కల్మశపాదుడనే రాజు జంతువులను వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా వశిష్ట మహర్షి కుమారుడు “శక్తి”ని రాజు గారు కలుసుకున్నాడు. కానీ, రాజుగారు ముని కుమారుణ్ణి ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ఆయనపట్ల అగౌరవంగా ప్రవర్తించాడు. అందుకు శక్తి ఆగ్రహించాడు, రాక్షసుడిగా మారిపొమ్మని రాజుని శపించాడు. కల్మశపాదుడు నరమాంస భక్షకుడిగా మారిపోయాడు. వెంటనే శక్తిని సంహరించి పొట్టన పెట్టుకున్నాడు. ఇది తెలిసి విశ్వామిత్రుడు పరమానంద భరితుడయ్యాడు. పైగా కల్మశపాదుడి దగ్గరకు వెళ్ళి “వశిష్ఠుడి సంసారాన్ని నాశనం చేయడానికి కావలసిన సాయమంతా చేస్తాను” అని అభయం కూడా ఇచ్చాడు. ఆ రకంగా వశిష్ఠ మహర్షి కుమారులు నూరుగురిని రాక్షసుడు హతమార్చాడు.
వశిష్ఠుడు కొడుకుల్ని పోగుట్టుకొని భరించలేని దుఃఖంలో వున్నాడు. శక్తి చనిపోయేనాటికి అతని భార్య అదృశ్యంతి నిండు గర్భిణీ. ఆమె దినా రాత్రులు నిద్రాహారాలు మాని భర్తకోసం పరితపించింది. పలకరిస్తే చాలు గుండె పగిలేలా ఏడ్చేది. అడవిలో ఆశ్రమంలో మూగగా బ్రతికింది. కొన్నాళ్ళకు ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతనే పరాశరుడు.
పెద్దయ్యాక పరాశరుడికి తన తండ్రిని ఒక రాక్షసుడు చంపి భక్షించాడని తెలిసింది, ఉగ్రుడాయ్యాడు. మొత్తం రాక్షస జాతిని తుదముట్టించేందుకు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం సాగుతోంది, క్రమేపీ వాడివేడి పుంజుకుంది. రాక్షసులు భయభ్రాంతులై పిచ్చిగా పరిగెత్తారు. దేవతలు, మునులు, పరాశరుడి తీవ్ర కోపానికి, యాగశక్తికి విస్తుపోయారు. ఆ సమయంలో అత్రిమహర్షి, మరి కొందరు మునులు పరాశరుని బ్రతిమాలి, నచ్చజెప్పి యాగం విరమించుకునేలా చేశారు. మహాభారతం ఆదిపర్వంలో ఈ కథ ఉంది.
మరొకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అసురుల శస్త్రాగ్నికి సూర్యచంద్రులు తేజం కోల్పోయారు. సర్వత్రా చీకట్లు అలముకున్నాయి, చీకట్లను పారద్రోలమని దేవతలు అత్రి మహర్షిని వేడుకున్నారు. మహర్షి వారి కోరికను మన్నించి సూర్యచంద్రుల్లో విలీనం అయ్యాడు. వెంటనే చంద్రుడు వెన్నెల వెలుగులని దేవతలకు అందించాడు. ప్రచండ సూర్య తేజానికి అసురులు మలమలమాడి పోయారు. అత్రిమహర్షి వల్ల ఈ విధంగా దేవతలు రక్షింపబడినట్టు వాయుదేవుడు అర్జునుడికి చెప్పాడు. అనుశాసన పర్వములో ఈ కథ ఉంది
కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, మరో ఇద్దరు మునిపత్నులు ప్రపంచ పర్యటనకు బయలుదేరారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా కరువుకాటకాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. శిబి చక్రవర్తి కుమారుడు వృష ధర్బి ప్రపంచ పర్యటనలో ఉన్న ముని పుంగవులు పిలిచి గోవులు, బంగారం, వెండి ఆభరణాలను ఇచ్చి సత్కరించాలి అనుకున్నారు.
వెంటనే వాళ్ళ ఆహ్వానాలు పంపాడు. కానీ ఆ ఆహ్వానాన్ని మన్నించి తిరస్కరించారు.
హోమం చేసి అగ్నిగుండం నుండి ఒక రాక్షసిని సృష్టించాడు. అత్రిమహర్షి, ఇతర మునులను హతమార్చవలసిందిగా వృష ధర్బి రాక్షసిని ఆదేశించాడు. అది వెళ్లి మారువేషంలో అడవిలో ఒక తామర కొలను దగ్గర నిలబడి ఉండగా అత్రి, ఇతర మహర్షులు అటుగుండా వెళ్లడం జరిగింది. మహర్షులు రాక్షసిని గుర్తించి, త్రిదండి తో దానిని చావబాదారు. తదనంతరం వాళ్లు బ్రహ్మలోకం వెళ్లారు.
అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయ కుమారుడిని నిమి. నిమి కుమారుడు వెయ్యేళ్లు బ్రతికి ఆ తర్వాత తనువు చాలించాడు. తాతగారి ఆనతి మేరకు కుమారుడికి శ్రాద్ధకర్మలు జరిపించాడు నిమి. అప్పుడు అత్రి మహర్షి శ్రాద్ధకర్మల ప్రాముఖ్యాన్ని వివరించాడు.