తెలివి

మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు. వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాపురం వెళ్లాలంటే ఒక పెద్ద అడవి దాటి వెళ్ళాలి. ముగ్గురు స్నేహితులు ఊరు నుండి ఉదయం బయలు దేరారు, రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. పోతూ పోతూ ఉంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది. మళ్లీ పోతూ పోతూ మరొకరికి చాట దొరికింది. అలాగే మరొకరికి గడ్డపార దొరికింది. వారు ముగ్గురు ఒక గుడిలో నిద్ర పోయారు.

అంతలో ఒక రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ రాక్షసునికి నరవాసన వచ్చింది, ఆ వాసనను బట్టి గుడి దగ్గరకు చేరుకున్నాడు. నరవాసనను గుర్తు పట్టి ఆ గుడిలో మనుషులు ఉన్నారని, ఒరేయ్! మానవా, నేనెవరో తెలుసా… రాక్షసుడిని! రారా బయటకి నమిలి మ్రింగేస్తా” అని పెద్దగా అరుస్తూ అన్నాడు రాక్షసుడు. ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో “ఒరేయ్ రాక్షసుడా! నేనెవరో తెలుసా? నేను రాకాసుల గాంచిన గూకాసినిరా!” అన్నాడు కోపంగా అరుస్తూ.

“అయితే బయటికి రా నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం” అన్నాడు రాక్షసుడు. నేను రావడం ఏమిట్రా నా గోరు చాలు నిన్ను పొడి చంపడానికి అని గడ్డపార చూపాడు. అమ్మో ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. నా చెవి చూడరా, నా చెవిని ఆడించాలి అంటే గాలికే కొట్టుకుపోతావ్ అని చాటను బైట అటూ ఇటూ ఊపాడు. గూకాసుని చెవిని చూసి వణికిపోయాడు రాక్షసుడు. నా తోక చూడరా అని త్రాడును బయటకు విసిరాడు. అంతే ఆ దెబ్బతో ఆ రాక్షసుడు వణుకుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్ర పోయి, తెల్లవారుజామున లేచి నడవడం మొదలు పెట్టారు.

తెలివి ఉంటే ఏ పనినైనా తేలికగా సాధించవచ్చు

స్పందించండి