శోభావతీ అని నగరం ఉండేది. దానిని యశః కేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రహ్మనభక్తి కలవాడు. అంతేగాక గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల ద్వారా ఇతర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని కొచ్చే సమాచారం తెచ్చిన వేగుల చక్కని బహుమానాలు, విరివిగా జీతాల్ని ఇచ్చేవాడు.
మా కెప్పుడూ ఈ రాజే కావాలని ప్రజలు కోరుకొనే రీతిలో అతి చక్కగా… ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు.
ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరమూ ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయం కెదురుగా ఒక కొనేరుంది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా, దేవిని ఆరాధించే వారు.
ఒక ఏడు ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుండి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న ఈ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవలుడు కోనేటిలో స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది.
“ఈమె నాకు భార్య అయినచో.. కొంతకాలం కాపరం చేశాక నా శిరమును నీకు బలి ఇచ్చుకుంటాను.. ” అని ఆలయంలోని కాళికి మొక్కుకొని… దేవి పూజలు చేసి ఆమెను వెంటాడి, ఆమె ఇంటి గుర్తులు చూసుకొని… తానే పనిమీద బయలుదేరాడు అని మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి… ఆ యువతి యందు ప్రేమతో రోజురోజుకీ కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము, భయమూ ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. అతను జరిగిన విషయాన్ని పుస గుచ్చినట్టు చెప్పాడు. అతను ఇచ్చిన గురుతుల్ని బట్టి శోభావతిపురానికి వచ్చి ఆమె పెద్దలను కలుసుకొని “నా కొడుకు మీ అమ్మాయిని ప్రేమించినాడు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. నా బిడ్డకు మీ పుత్రిక నిత్తురా?” అని అడిగారు.
“తప్పకుండా, ఇది మాకు అంగీకారమే” అని చెప్పారు అమ్మాయి తల్లితండ్రులు. కొద్దిరోజుల్లోనే ధవలుడికి వివాహం జరిగిపోయింది. తరువాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు.
కొంతకాలం గడిచింది. ఎప్పుడు ధవలుడి బావమరిది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. “బావా! నిన్నూ మా సోదరిని మా తల్లితండ్రులు ఇంటికి తీసుకొనిరమ్మన్నారు. మీ తల్లితండ్రుల అనుమతి పొందాను. ఇక మీదే ఆలస్యం” అన్నాడు.
ధవలుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యని తీసుకొని బావమరిదితో తన అత్తవారింటికి బయలుదేరాడు.
వారు ముగ్గురూ ప్రయాణం చేసి చేసి శోభావతి నగర సమీపం చేరారు. అలసివున్న వారు కొంచం సేపు సేద ధీరుటకు గాను అక్కడ ఆలయంలో విశ్ర మించారు. కాళికాదేవి ఆలయం.. కోనేరు.. చూసేసరికి ధవలుడికి గతం గుర్తువచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే భర్యకు గాని, బావమరిదికి గాని చెప్పకుండా దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాళికాదేవికి బలి ఇచ్చాడు.
బావ ఏమయ్యాడో తెలియక “వెదకి వస్తాను” అని బయల్దేరాడు బావమరిది. ఆ ప్రాంతమంతా తిరిగి, అతను చివరికి ఆలయంలోకి వెళ్ళాడు. తల తెగి ఉన్న బావని చూశాడు. అతనికి ఏమీ తోచలేదు. తను కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు.
తన సోదరుడు బావని వెదకడానికి వెళ్లినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరినీ వెదకడానికి ఆమె బయలుదేరింది. వెదకి వెదకి వేసారి చివరకు ఆమె కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళింది.
అక్కడ తన భర్తదీ, సోదరుడిదీ తలలు పడివున్నాయి. వాటి పక్కనే వారి మొండేములు కనిపించాయి. ఆమెకు భయం వేసింది, విపరీతమైన దుఃఖమూ, వైరాగ్యము కూడా కలిగాయి. “భర్త… సోదరుడు… లేని జీవితం నాకెందుకు?” అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందు ఉరి పోసుకొని చనిపోబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై “యువతి! నీ పతి భక్తికి, సోదర ప్రేమకి ఎంతో సంతోషించాను. నీలాంటి ఉత్తమ స్త్రీలు ఆకలా మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులను రెండింటినీ మొండేములకు కలుపుము. వారు తక్షణం బతుకుతారు” అని చెప్పి అదృశ్యం అయింది.
అనూహ్యమూ, అత్యంత అనందాయకమూ అయిన దేవి వరానికి ఆశ్చర్యపోతూ తన తొందరపాటుతో ఆమె భర్త శిరస్సును సోదరుని మొండేనికి, సోదరుని శిరస్సు భర్త మొండెనికి కలిపింది. దేవి వరప్రసాదం వల్ల వారిద్దరూ ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు.
ఆమె వారిద్దరినీ చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివితక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. ఆమెకు ఏమి తోచడంలేదు.
రాజా! వారిద్దరిలో ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాదగిన వాడెవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది” అన్నాడు భేతాళుడు.
“సర్వెంద్రియాణం నయనం ప్రధానమని, సర్వెంద్రియాణం శిరః ప్రధానం అనీ పెద్దలు చెప్పిన న్యాయము, ధర్మము. నయనము, బుధ్ధి వుండేవి శిరస్సులోనే, కనక మనిషి గుర్తింపు అతని శిరః భాగం బట్టే జరగడం సముచితం. కనుక పతి శిరస్సు కలవాడు ఆమెకు భర్త. రెండవ వాడు సోదరుడు” అని చెప్పాడు విక్రమాదిత్యుడు.
భేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.