నిజమైన వేటగాడు

పూర్వం బసవయ్య అనే వేటగాడు, అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్లేసరికి, బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనబడింది. దానికి కాస్త దూరంలో నేలమీద మెరుస్తూ బంగారు గొలుసు కనబడేసరికి, దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఓ కుందేలును వేటాడి ఇంటికి తీసుకొని పోయాడు.

ఓ నెలరోజుల తర్వాత “దసరా పండుగ వస్తుంది. ఇంట్లోకి సరుకులు, పిల్లలకు బట్టలు తీసుకురండి” అంది భార్య. మన వద్ద దాచిపెట్టిన డబ్బులే లేవు. ఈ గొలుసు అమ్మి తెస్తాను, అని చెప్పి పట్నానికి బయలుదేరాడు. నేరుగా కంసాలి కనకయ్య దుకాణానికి వెళ్లి గొలుసు చూపించి, దీని తీసుకుని వచ్చినంత డబ్బులు ఇవ్వండి అని అడిగాడు.

కంసాలి కనకయ్య ఆ గొలుసు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తను చేసింది, ఏడాది క్రితం దాన్ని మురారికి ఇచ్చాను. నెల నుండి అతను కనిపించడం లేదు. ఇతనే గొలుసు కోసం మురారిని చంపి ఉంటాడు, అనుకొని వెంటనే బటులకు సైగ చేశాడు. రాజభటులు నగతో సహా బసవయ్యాని లాక్కొని వెళ్లి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఇంతలో మురారి భార్య కూడా ఏడుస్తూ న్యాయాధికారికి మొరపెట్టుకుంది.

“అయ్యా! నా భర్తను ఇతడే చంపేసి ఉంటాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన వారికి మరణ దండన విధించి, నా గొలుసు నాకు ఇప్పించండి. నా భర్త జ్ఞాపకార్థం దానిని అట్టి పెట్టుకుంటాను” అని ఆమె కన్నీళ్లు పెట్టుకొని న్యాయాధికారి వేడుకుంది.

న్యాయాధికారి పేరు ధర్మరాజు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడని, న్యాయబద్ధంగా తీర్పు చెబుతాడని తనకు చాలా మంచి పేరుంది.

తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, “ఈ నగ నీకు ఎక్కడిది? నిజం చెప్పు!” అని అడిగాడు న్యాయాధికారి.

“అయ్యా! ఉదయమే నేను వేటకు వెళ్తుంటే, జంతువులు తినేసిన సగం మనిషి శవం దారి పక్కన కనపడింది. ఆ పక్కనే ఈ గొలుసు పడి ఉంటే తీసుకున్నాను. సొంతదారుకు ఇస్తామన్నా అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు కుటుంబ అవసరాల కోసం అమ్ముదామని వస్తే, భటులు నన్ను పట్టుకొని, దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు” అన్నాడు బసవయ్య.

“నువ్వు అబద్ధం చెపుతున్నావు అని మురారి భార్య అంటుంది. నువ్వే నగ కోసం మురారిని చంపలేదని నమ్మకం ఏమిటి?” అని అడిగాడు ధర్మరాజు.

“అయ్యా! నేను వేటగాడినే కానీ, దొంగను కాను. నన్ను నమ్మండి, కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు” అన్నాడు బసవయ్య.

“ఏం పరీక్ష చేయమంటావు? నీ విలువిద్యా ప్రావీన్యం ఏపాటిదో చూపిస్తావా?” అని అడిగాడు ధర్మరాజు.

“నా వెంట అడవికి రండి. జంతువుల్ని, నాకు నగ దొరికిన స్థలాన్ని కూడా చూపిస్తాను” అన్నాడు బసవయ్య ధీమాగా.

సరేనని న్యాయాధికారి, మురారి తమ్ముడుని వెంట పెట్టుకుని వేటగాడితో అడవికి వెళ్ళాడు. బసవయ్యను చూసిన కాకులు కావ్.. కావ్.. మంటూ గోల గోలగా అరవసాగాయి. జింకలు, నక్కలు భయంతో అడవిలో పరుగులు పెట్టసాగాయి.

“నిజమే నువ్వు వేటగాడివి అని నమ్ముతున్నాను. స్థలం చూపించు” అన్నాడు న్యాయాధికారి.

బసవయ్య న్యాయాధికారిని వెంట పెట్టుకొని, ఆ స్థలం వద్దకు వెళ్లి చూపించ సాగాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రు.. గాండ్రు.. అంటూ పెద్దపులి అరుపు వినిపించింది.

“అదిగో, మనిషిని చంపిన పులి వస్తోంది. కనుకే మాటు వేసి కూర్చుంది మరో మనిషి కోసం. మీరు చెట్టు ఎక్కండి అని బసవయ్య గబగబా వాళ్ళను చెట్టు ఎక్కించాడు. తర్వాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకొని కూర్చున్నాడు.

కాసేపటికి పులి వాళ్ళ కూర్చున్న చెట్టు కిందకు వచ్చి, మనుషుల్ని అందుకోవడం కోసం చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది.

బసవయ్య బాణం సందించి పులి మీదకు సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్లి నేలమీద పడి చనిపోయింది. అందరూ చెట్టు మీద నుంచి కిందకు దిగారు.

అప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగా చూస్తూ, “నువ్వు దొంగవై ఉంటే మమ్మల్ని చంపేసి, మా మెడలో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునే వాడివి. కానీ నువ్వు నిజమైన వేటగాడివి. నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను. మా ప్రాణాల్ని కూడా రక్షించినందుకు నీకు బహుమతిగా ఈ హారం ఇస్తున్నాను తీసుకో”, అని తన మెడలో ఉన్న బంగారు గొలుసును వేటగాడి మెడలో వేసాడు.

“అయ్యా! మీరు నన్ను వేటగాడికి నమ్మినందుకు సంతోషం. కానీ ఈ మాటలు ఇక్కడ కాదు, మీ న్యాయస్థానంలో పదిమంది ముందు చెప్పండి” అని గొలుసు తిరిగి ఇచ్చివేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతో పాటు అతడిని తీసుకువెళ్లి సభ ఏర్పాటు చేశాడు.

“సభికులారా! మీతో పాటు నేను కూడా అనవసరంగా ఇతడిని అనుమానించాను. ఇతని సాహసం వల్లనే నేను తిరిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. బసవయ్య నిజమైన వేటగాడు, కాకుంటే మేము ఈపాటికి పులి ఆహారమై పోతుండే వాళ్ళం. బసవయ్యకు మురారి గొలుసు దొరికింది కానీ, మురారిని హత్యచేసి ఆ గొలుసును దొంగిలించలేదు” అని న్యాయాధికారి ధర్మరాజు జరిగిన సంఘటన అంతా వివరించాడు. ప్రజలు అభినంద పూర్వకంగా చప్పట్లు చరిచారు. తర్వాత ధర్మరాజు, రాజభటులు తెచ్చిన గొలుసును మురారి భార్య మణెమ్మకు ఇచ్చివేశారు.

అనంతరం న్యాయాధికారి తన మెడలో గొలుసును తీసి, “మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు చిన్ని బహుమతి ఇస్తున్నాను” అని ప్రకటించి తన మెడలోని హారం తీసి, బసవయ్య మెడలో వేయబోయాడు.

“అయ్యా! మన్నించండి, మీ కానుకలు తీసుకోలేను. మాకు పండుగ సరుకులు బట్టలు ఇప్పించండి చాలు గొలుసు మాత్రం వద్దు” అని వేడుకున్నాడు.

బసవయ్య మాటలు విని ఏదో అర్ధమయినట్లుగా నవ్వి, ఏడాదికి సరిపడా సరుకులు, అతని కుటుంబానికి సరిపోవు బట్టలు పెట్టి గౌరవంగా వీడ్కోలు పలికాడు న్యాయాధికారి.

భేతాళుడు ఈ కథ చెప్పి “రాజా! బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి అడవిలోకి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు, బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలియకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది” అన్నాడు.

అప్పుడు విక్రమార్కుడు, “న్యాయాధికారి  సభలోనే బసవయ్య తడబడకుండా సమాధానాలు చెప్పిన తీరుకు అతడు వేటగాడనే నమ్మాడు. కానీ జనానికి నమ్మకం కలిగించడం కోసం మురారి బావమరిదిని తీసుకొని అడవికి వెళ్ళాడు అంతే కాని భయంతో రక్షణ కోసం కాదు. దొంగ అని అనుమానిస్తే వెళ్లేవాడే కాదు.

అడవిలో హారం ఇవ్వబోగా వద్దన్నా బసవయ్య దానిని సభలో ఇమ్మని కోరింది, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని. అడవిలో గొలుసు తీసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే, జనానికి నిజం తెలియక దొంగలాగే అనుమానిస్తారు. అందుకే సభలో ఇవ్వమని కోరాడు.

ఇంకా ఆ పులి సంఘటన న్యాయాధికారి గానీ, వేటగాడు కానీ అస్సలు ఊహించలేదు. తన ప్రాణాల్ని కాపాడాడనే కృతజ్ఞతతో న్యాయాధికారి హారం ఇద్దామనుకున్నాడు. సభలో హారాన్ని ఇస్తున్నా బసవయ్య వద్దనడానికి కారణం, వేటగాడు దాన్ని ఎల్లకాలము ధరించడు. ఏనాటికైనా హారాన్ని అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకోవలసిందే.

వెంటనే అమ్మితే న్యాయాధికారికి బాధ అనిపించొచ్చు. జనానికి ఈర్ష, అనుమానం కలగొచ్చు. తన కుటుంబం గడవడానికి సరుకులు మాత్రమే కావాలి. బంగారం ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే హారం వద్దని సరకులు, వస్త్రాలు మాత్రం ఇప్పించమని అడిగాడు.

న్యాయాధికారి మురారి భార్యకు భర్త హారం ఇప్పించి, వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి, ఇద్దరికీ సరైన న్యాయం చేశాడు అని చెప్పాడు.

భేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

స్పందించండి