పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు.
కుణాలుడు తన ఇంటినుండి పడమరగా కొంత దూరం వెళ్లితే ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాచనగరి వున్నది.
కుణాలుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. అడవిలో నీడగా చల్లగా వుంటుంది. ఎండ వేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాలుడు అడవిలోకి ప్రవేశించబోయాడు.
సరిగా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం, “కుణాలా! అడవిలో ప్రవేశించవద్దు! హత్య చెయ్యగలవు!” అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటునుండి వచ్చిందో, ఎంతదూరం నుండి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు. మొదట, తనతో ఎవరో పరాచకా లాడుతున్నారని చెట్ల వెనక చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు.
ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాలుడు ఆ హెచ్చరికను పాటించలేదు. వాడు అడవిలో ప్రవేశించి చెట్ల నీడన నడవసాగాడు. ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు. కాని అడవిలో ఎవరూ తగలలేదు. ఏమి జరగకుండానే వాడు అడవి అవతలివేపు చేరాడు.
ఇంకా ఎండ జాస్తిగానే ఉంది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకొని కుణాలుడు అడవి చివరి చెట్ల నీడన కాస్సేపు నిద్రపోయి, ఎండ మీద పడగానే లేచాడు. బీడు దాటి, కొండ ఎక్కి దిగవలసి ఉంది. అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు.
పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది. “కుణాలా! బీడు మీదికి వెళ్లకు! దేశానికి అరిష్టం తెగలవు!”
“ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా బెదిరిస్తావు? నీమాట నేను నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తున్నావు? నేనెవరినీ హత్య చేయలేదు,” అన్నాడు కుణాలుడు.
“హత్యచేశావు. నీకు తెలియదేమో ! నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది!” అన్నది కంఠం.
“దానికి నేనేం చెయ్యగలను? అటువంటి పొరపాటు ఎవరివల్లనైనా జరగవచ్చు. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్దం!” అంటూ కుణాలుడు ముందుకు నడక సాగించాడు.
వాడు కొండను చేరుకునేసరికి పోద్ధూకి పోయింది. కాని కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు వుంటుందని వాడికి తెలుసు. అందుచేత వాడు కొండను ఎక్కడం ఆరంభించాడు. మళ్ళా అదే కొంఠం “కుణాలా! కొండ ఎక్కకు! చచ్చిపోగలవు!” గంభీరంగా పలికింది.
కుణాలుడికి మండిపోయింది. “నన్నెందుకిలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? బీడు దాటాను. దేశానికి అరిష్టం తెస్తానన్నావు. తెచ్చాను?” అని వాడు కేకపెట్టాడు.
“తెచ్చావు! నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలకలను బెదిరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్ళి అక్కడి చెట్లమీద గుడ్లు పెడుతుంది. అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణి కెవ్వున కేకవేసి పడిపోయింది. ఆమె గర్భం కాస్తా పోతుంది. రాజుగారికి మరి సంతానం కలగదు. అందుచేత, రాజుగారి తమ్ముడు రాజవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని ఆరాజకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్ధానికి నువ్వే కారకుడివి!” అని ఆ కంఠం జవాబు ఇచ్చింది.
“ప్రతి సంఘటనకూ ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణని ఒప్పుకోను!” అంటూ కుణాలుడు కొండ ఎక్కసాగాడు. అతను కొండశిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది.
కుణాలుడు విజయ గర్వంతో, “ఇప్పుడేం చెబుతావు? కొండ ఎక్కాను. కాని ఇంకా బతికే ఉన్నాను! నీ మాటలన్నీ అబద్దాలు!” అన్నాడు నవ్వుతూ.
“పిచ్చివాడా, నీతో అబద్దం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కొండ ఎక్కిన వాడు దిగాలి కదా! ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరిని చూడబోవు! నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు!” అన్నది కంఠం.
కుణాలుడు ఈ సారి బెదిరిపోయాడు. కమ్ముకువచ్చే చీకటిలో కొండ దిగడం వాడికి ప్రమాదమని పించింది. తెల్లవారే దాకా కొండమీదనే ఉందామనుకున్నాడు. కాని కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వాడికి తోచింది. ఎందుకంటే, వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది. అప్పుడు తనకు చావు తప్పదు. అలాంటప్పుడు చావుకోసం తాను తెల్లవారిందాకా కాచుకొని ఉండనవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించనవసరం లేదు.
ఇలా అనుకొని కుణాలుడు చీకటిలోనే కొండదిగ నారంభించి, ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు. తరువాత కొద్దికాలానికి, అశరీరవాణి చెప్పినట్టే, రాణిగారి మెడమీద ఆకు పురుగు పాకడమూ, ఆమె మూర్ఛపోవటమూ, గర్భస్రావం కావటమూ, రాజుగారికి మరి పిల్లలు కాలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటమూ, వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించటమూ, రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటమూ జరిగాయి.
భేతాళుడీ కథ చెప్పి, “రాజా, నాకొక సందేహం కలిగింది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాలుడు తప్పు చేశాడా, లేదా? అతనికి హత్య చేసిన పాపమూ, రాజ్యానికి విపత్తు కలిగిన పాపమూ, ఆత్మహత్య చేసుకున్న పాపమూ అంటుతాయా, అంటవా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
“కుణాలుడు తప్పు చేయలేదు. అతనికి ఏ పాపమూ అంటదు. అశరీరవాణికి భవిష్యత్తు తెలుసు కాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు. ఉన్న పక్షంలో అది కుణాలుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా, భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది. తాను అడవిలో ప్రవేశించి నందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినా, కుణాలుడు వెనక్కు తిరిగి పోయి ఉండేవాడే, కాని కుణాలుడు అడవి ప్రవేశించకుండా, బీడు దాటకుండా, కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవాణికి లేనట్టు స్పష్టమవుతున్నది. అటువంటప్పుడు మానమాత్రుడైన కుణాలుడికి పురుగును చంపకుండా, రాజ్యానికి అరిష్టం రాకుండా, తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు? అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే! అందువల్ల ఏ విధంగా చూచినా కుణాలుడు పూర్తిగా నిర్దోషి!” అని విక్రమార్కుడు జవాబిచ్చాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కాలగగానే భేతాళుడు శవంతో సహ మాయమై మళ్లీ చెట్టెక్కాడు.