పూర్వం నైమిశారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా వున్న పిల్లలు, రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలూ చేస్తారు. ప్రపంచాన్ని చూస్తున్న కొద్ది ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది. ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడిపైన ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించడానికి గాను శివుణ్ణి గురించి మహా కఠోరమైన తపస్సు ప్రారంభించాడు.
మాండవ్యుడు నైమిశారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటికాలిపై నిలబడి, చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టె, నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు. ఈ సమాధిలో వుండి ఆయన, “పరమేశ్వరా, నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఈలాగే తపస్సు సాగిస్తాను!” అన్నాడు.
కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలూ చలించసాగాయి. భూమి కంపించింది. సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి. అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దండకారణ్యంలో ప్రళయ మారుతం సాగి చెట్లను కూకటి వేళ్ళతో సహ పెకలించసాగాయి.
తనచుట్టూ ఇంత సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడు ఈ మాత్రం చలించలేదు. తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతున్నదన్న సంతోషం ఆయనకు మరింత శక్తి కలిగించింది.
ఈ సమయంలో రెండు గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించటానికి ప్రయత్నం ప్రారంభించాయి. ఆడగువ్వ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా వున్నది. త్వరలో గూడుకట్టి, అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చెయ్యాలి. కాని, గూడు పెట్టటానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. గాలి మూలాన పొదలో గూడు నిలవటంలేదు.
అవి చుట్టూ చూశాయి. పద్మంలాగా తెరిచి పెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంటపడ్డాయి. మహామహా వృక్షాలు గాలికి ఊగిసలాడి పోతున్నప్పటికీ ఆయన చేతులు నిశ్చలంగా ఉన్నాయి.
రెండు గువ్వలూ దైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి. ఆ గూడులో గువ్వ నాలుగు గుడ్లు పెట్టి, వాటిని పొదిగింది. అవి పిల్లలయ్యాయి. ఆడపక్షి, మగపక్షి ఒకదాని తరువాత ఇంకొకటి ఎగిరివెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి. క్రమంగా పిల్లలు పెరిగి పెద్ధవి కాసాగాయి.
ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు. తన శరణుజొచ్చిన గువ్వాలపైనా, వాటి పిల్లలపైనా, ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది. ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడుకేసి రావడం చూసి ఆయన తన చేతులను కిందకు దించి, పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి పట్టుకున్నాడు.
అది మొదలు ఆయన అప్పుడప్పుడూ చేతులు దించి పక్షిపిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ వుండేవాడు. పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ వుండేవాడు.
పిల్లలు పెద్దయ్యాయి, వాటికి రెక్కలు వచ్చాయి. అవి గూడు విడిచి ఎగరదగిన తరుణం వచ్చింది. మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ, “మీరు కూడా నాలాగే ఎగరండి” అన్నట్టు ప్రోత్సహించసాగింది. ఒకటి రెండు రెక్కలు ఎత్తి దించాయి గాని, ఎగరటానికి భయపడ్డాయి. ఆడపక్షి వాటిని గూటినుండి మెల్లగా బయటికి నెట్టబోయింది. పిల్లలు మరింత బెదిరాయి. ఆడపక్షి మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి. అప్పటికీ లాభం లేకపోయింది.
సరిగా ఈ సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు. ఆయన పక్షులు గూటిని ఒక చేతిలో పెట్టుకుని, రెండవ చేతి వేలితో ఒక్కొక్క పిల్లనే గూటినుంచి మెల్లగా బయటికి తొయ్యసాగాడు. ఒక్కొక్క పిల్ల కింద పడబోవటమూ, మరుక్షణం రెక్కలు కొట్టుకోవడమూ వెంటనే దానికి ఎగరటం జరిగింది. ఈ విధంగా నాలుగు గువ్వ పిల్లలూ కొద్దిసేపట్లోనే ఎగరడం నేర్చాయి.
మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది. “పిచ్చి ప్రాణులు! అసహాయ జీవులు! నోరులేని పక్షులు!” అనుకున్నాడాయన. ఆ గువ్వ కుటుంబం తలచుకొని ఆయన హృదయం ప్రేమతోనూ, జాలితోనూ నిండిపోయింది.
ఇంతలో ఆయనకు ఆకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన చుట్టూ కలయజూశాడు. గాలి ఎప్పుడో నిలిచిపోయింది. అంతకు పూర్వం విరిగి పడిపోయిన చెట్లు చిగుర్చుతున్నాయి. ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేదని మాండవ్యుడికి తెలిసిపోయింది. కానీ ఆయన ఆశాభంగం చెందలేదు. ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి, “పరమేశ్వరా, నువ్వీ ప్రపంచాన్ని ఎందుకు లయం చెయ్యటం లేదో నాకర్దమయింది! నీ ఇష్ట ప్రకారమే జరగనీ!” అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్లి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు.
భేతాళుడీ కథ చెప్పి, “రాజా, మాండవ్యుడి తపస్సు భగ్నం కావటానికి నిజమైన కారణమేమిటి? సమాధిలో వుంది, చేతులు కదిలించడం వల్లనా? అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్ధం చేసుకున్నదేమిటి? ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటంలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు.
“మాండవ్యుడి తపస్సు భగ్నమైనది గువ్వల మూలంగా. ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుండి ఆయన తపస్సు చేయలేదు. మానవమాత్రుడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంతా ప్రేమా, జాలి ఉంటే, పరమేశ్వరుడికి ప్రాణకోటిపై ఇంకా ఎంత ప్రేమ, జాలి ఉండవచ్చు! తన లాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించాడు. కాని ఈశ్వరుడికి ప్రాణకోటి యొక్క మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనసు మారిపోయింది!” అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు.
రాజుకు ఈవిధంగా మౌనభంగం కాగానే భేతాళుడు శవంతో సహ మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.