విఫలమైన ఆశలు

పూర్వం పడమటి తీరాన ఒక బెస్తగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది. తుఫానులు వచ్చినప్పుడు ఆ దేవికి ముడుపులు కట్టేవారు. తుఫానువల్ల బెస్తలకు ఎట్టి నష్టము లేకుండా దేవి కాపాడేది.

బెస్తలందరిలోకి అనుభవమూ, సమర్థతా ఉన్నవాణ్ణి చూసి నాయకుడిగా ఎన్నుకోవడం ఆచారంగా ఉండేది.  సాధారణంగా ఈ గ్రామంలో పుట్టినవారు ఇక్కడే ఉండి జీవితాంతం వరకూ చేపల వెటతోనే జీవిస్తూ ఉండేవారు. కాని ఎప్పుడైనా యువకులలో కొందరు నావికా వృత్తిలో ప్రవేశించి వర్తక నౌకలలో కళాసులుగా చేతి ద్వీపాంతరాలకు వెళ్ళేవారు. ఇలా నావికులుగా వెళ్లిన వారిలో కొందరు దురదృష్టవశాత్తూ నౌకలతో బాటు ముణిగిపోయేవారు. మిగిలిన వారు బాగా డబ్బు సంపాదించుకుని గొప్ప గొప్ప నగరాలలో నివాసం ఏర్పరుచుకునేవారు. అందుచేత గ్రామంలోని యువకులు నావికులుగా వెళ్ళిపోవటం పెద్దలకు అంత ఇష్టంగా ఉండేదికాదు.

నందుడనేవాడు బెస్తదొర రెండవ కొడుకు. వాడి అన్న సందుడు ఏడేళ్లవాడై ఉండగా తండ్రి చనిపోయాడు. రేణుకుడనే వాడు బెస్తలకు దొరగా ఎన్నికయ్యాడు. సుందుడు తన తండ్రి వద్దనే చేపల వేట నేర్చుకుని, ఇంకొకరి సహాయం లేకుండా తానే తెప్ప నాడుపుకు పోవటము, వల వెయ్యటమూ, వల మరమ్మత్తులు చెయ్యటమూ మొదలైన పనులు చెయ్యగలిగి  ఉన్నాడు. నందుడికి మాత్రం, ఇలాంటి పనులలో బొత్తిగా అనుభవం లేదు. అందుచేత వాణ్ని వాడి తల్లి రేణుకుడి దగ్గర చేపల వేట నేర్చుకోడానికి పెట్టింది.

మొదటినుండి కూడా నందుడు చాలా చురుకు గలవాడే కాక, సాహసి కూడానూ. అందుచేత వాణ్ని రేణుకుడు ఎంతో మెచ్చుకునే వాడు. ఊళ్ళో అంతా వాణ్ని గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. “ఇటువంటి వాడు నావికుడైతే ఎంతైనా సంపాదించ గలుగుతాడు!” అని బెస్తలు అప్పుడప్పుడు అనేవారు. వెంటనే నందుడి తల్లి, “అమ్మో, నా కొడుకు నావికుడు కావటమే? నేను ఒప్పను!” అనేది. ఆమెకు తన కొడుకు నావికుడైతే ఇల్లు వదిలి పోతాడని భయం.

రేణుకుడికి సుందరి అని ఒక కూతురు వుండేది. అది నందుడికంటే రెండేళ్ళు చిన్నది. పేరుకు తగినట్టు అది అందమైన పిల్లకావటం చేత అందరూ దాన్ని ముద్దు చేసేవారు. ఒకరోజు రేణుకుడు సుందరిని వేళాకోళానికి, “పెద్ద అయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు?” అని అడిగితే, “అదుగో, ఆ నందుణ్ణే చేసుకుంటా! ఇంకెవరిని చేసుకోను!” అన్నది.

ఈ మాట వినగానే నందుడి మనస్సులో ఏదో తుఫాను రేగినట్టయింది. వాడికి సుందరిని చూస్తే ఎంతో ఇష్టం. కాని ఆ పిల్ల తనను తప్ప ఇంకెవరినీ చేసుకోను అనగానే వాడికి తన భవిష్యత్తు యావత్తు ఒక్కసారి కలల ఎదుట కనపడినట్టయింది. ఇంకో ఏడెనిమిదేళ్లలో సుందరికి పెళ్లి ఈడు వస్తుంది. అప్పుడు తనకూ సుందరికి పెళ్లవుతుంది. అందుచేత ఈలోపుగానే తాను బోలెడంత ధనం సంపాదించాలి. ఈ ఊళ్ళో ఉండి చేపలుపడితే ధనం రాదు. అందుచేత తాను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి నావికుడిగా చేరాలి . కాని ఇదంతా తన వల్ల అవుతుందా? దేవి అనుగ్రహిస్తే ఎందుకు కాదు? 

వాడు ఒంటరిగా దేవి గుడికి వెళ్ళి మోకరించి, “అమ్మా, తల్లీ! నన్ను నావికుణ్ణి చేసి బాగా డబ్బు వచ్చేటట్టు చేస్తివా, సముద్ర తీరాన, సముద్రం మీద రెండు కోసుల దూరం కనిపించేటట్టు, గుట్ట మీద నీకు పెద్ద గుడి కడతాను! తరువాత సుందరీ, నేను పెళ్ళాడి, మేమిద్ధరమూ రోజూ నీకు మొక్కుకుంటాము!” అని ప్రార్థించాడు.

ఆ తరువాత వాడు తల్లి వద్దకు వెళ్లి ఆమెతో, “అమ్మా, నేను ఈ పల్లె వదిలి వెళ్ళిపోయి నావికుణ్ణి అవుతాను. నన్ను ఆశీర్వదించు!” అన్నాడు.

తల్లి ఈ మాట విని నిర్గాoతపోయింది. వెళ్లవద్దని కొడుకును బతిమాలుకుంది. “నాయనా, నాకు మీరిద్దరూ చెరొక కన్ను వంటివాళ్లు. నువ్వు వెళ్లితే నేను సగం గుడ్డిదాన్ని అవుతాను. ఇంత చిన్న వయసులో నువ్వు నావికుడివి కావటమేమిటి? నువ్వేమైపోయావో అని నేను రోజూ దిగులుపడుతూ బతకలేను. నువ్వు ఒకవేళ డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నా, తిరిగి రావు! నాకు తెలుసు!” అని తల్లి అన్నది.

నందుడు తిరిగి వస్తానని తల్లి మీద ఒట్టు పెట్టుకున్నాడు. తాను దేవతకు మొక్కిన మొక్కు విషయం కూడా వాడామెకు చెప్పేశాడు. నావికుడు కావాలన్న ఉద్దేశం వాడు మార్చుకునేటట్టు కనపడలేదు. విధి లేక తల్లి సరేనన్నది. వాడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు.

దేవి వాడి కోరిక తీర్చిందనే చెప్పాలి. ఎందుకంటే, పసివాడైనప్పటికి వాడికి వర్తక నౌకలలో ఉద్యోగం దొరికింది. వాడికి సహజంగా ఉన్న చురుకుదనం నౌకలు నడపడంలో బాగా రాణించింది. ఎన్నోసార్లు వాడు వర్తకులకు ఆపదలో అడ్డుపడ్డాడు. ఆరి తేరిన నావికులు కూడా బెదిరే తుఫానులలో వాడు యుక్తిగా ఓడలను నడిపి చాలా సమర్ధుడు అనిపించుకున్నాడు. అనేక మంది వర్తకులు వాడికి బాహుమానాలు కూడా ఇచ్చారు. తమ లాభాలలో వంతులిచ్చారు. వాడు చాలా ధనం సంపాదించుకున్నాడు.

ఎనిమిదేళ్ళ పాటు నావికుడిగా జీవించి నందుడు తాను సంపాదించిన ధనంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి రెండు సంవత్సరాల క్రితమే సుందరి సుందుడికి భార్య అయిపోయింది. నందుడి ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఆ సుందరి కోసమే వాడు అన్ని శ్రమలుపడి అంత డబ్బు సంపాదించుకొని వచ్చాడు. ఇప్పుడు వాడికి భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. సుందరిని కాక మరొకరిని చేసుకోవటం వాడికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే, ఎనిమిదేళ్లుగా వాడు సుందరే తన భార్య అని మనస్పూర్తిగా నమ్మాడు.

అయితే సుందరి నందుణ్ణి ఏనాడో మరిచి పోయింది. ఆ రోజు నందుణ్ణి తప్ప ఇంకొకరిని పెళ్లాడనని అన్నమాట కూడా ఆమెకు జ్ఞాపకం లేదు. నందుడు నావికుడు కావటానికి వెళ్ళిపోయిన నాలుగేళ్లకు సుందరి తండ్రి చనిపోయాడు. సుందరినీ ఆమె తల్లినీ పోషించే మగదిక్కెవరూ లేరు. అందుచేత వాళ్ళు తిండికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ లోపల సుందుడు చేపల వేటలో చాలా ప్రావీణుడైనాడు. ఆ గ్రామంలో సుందరిని పెళ్లాడటానికి అతని కంటే అర్హుడే లేడు.అతను తననూ, తన తల్లినీ ఆదుకొని సహాయపడినందుకు సుందరి అతన్ని ఇష్టంగానే పెళ్లాడింది.

ఈ సంగతులన్నీ తెలుసుకున్నాక నందుడు ఎవరినీ తప్పుపట్టలేక పోయాడు. కానీ అతని మనసులో సుందరి మీద ఆశ మాత్రం చావలేదు. సుందరిని ఎలాగైనా తనతో వచ్చేయటానికి ఒప్పించి, ఆమెను ఏ దూరదేశమన్నా తీసుకొని పోయి అక్కడ పెళ్లాడి సుఖంగా ఉందామని అతనికి దుర్బుద్ది పుట్టింది. ఈ ఆలోచనను అతను రహస్యంగా సుందరికి చెప్పాడు. సుందరి ఈ సంగతంతా తన అత్తగారితో చెప్పేసింది.

నందుడి తల్లికి తన కొడుకు స్థితి చూసి చాలా బాధ కలిగింది. ఆమె అతనిని ఒంటరిగా అవతలకి తీసుకొనిపోయి, “మన వంశానికి కళంకం తెచ్చే ఈ బుద్ధులు ఎక్కడ నేర్చుకున్నావు, నాయనా? నావికుడుగా దేశాదేశాలూ తిరిగి ఇంతపాడై పోయావా? నీకు వదినె ఒకటీ, తల్లినైనా నేను ఒకటే, నీ సుఖం కోసం నీ అన్న కాపురం పాడుచేస్తావా? ఇలా తిరిగి వచ్చే కన్నా నువ్వు తిరిగి రాకుండా ఉంటేనే ఎంతో  బాగుండిపోయేదే? ప్రయోజకుడివై ఇంత డబ్బు సంపాదించుకున్నావు. ఎక్కడనైనా బతగగలవు. ఈ ఊర్లో ఉండి నువ్వు బాధ పడుతుంటే నేను చూడలేను. ఇంకెక్కడికైనా వెళ్లిపో!” అన్నది.

“సరే నమ్మా! వెళ్లిపోతాను !” అన్నాడు నందుడు తలవంచుకొని.

మర్నాడు తెల్లవారు జామున సుందుడు ఒక తెప్పమీద చేపల వేటకు బయలుదేరేటప్పుడు నందుడు, “అన్నా, నేను చేపల వేటకు పోయి చాలా కాలమైంది. ఇవ్వాళ నేను కూడా ఒక తెప్ప వేసుకొని వేటకు వస్తాను !” అన్నాడు.

ఇద్ధరన్నదమ్ములూ చెరొక తెప్ప వేసుకొని సముద్రంమీద బయలుదేరారు.

సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా బెస్తలు తిరిగి వచ్చే వేళకు సుందరి, ఆమె అత్తగారు భోజనంతో సహ సముద్రతీరానికి వచ్చారు. కొద్ది సేపట్లో అందరూ తిరిగి వచ్చారు, కానీ నందుడు మాత్రం తిరిగి రాలేదు. అతని కోసం సుందుడు, మరికొందరు తిరిగి సముద్రం మీద వెతుక్కుంటూ వెళ్లారు. వారికి నందుడు తీసుకొని పోయిన తెప్ప మాత్రమే దొరికింది. నందుడు జాడలేదు. అతను సముద్రంలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.

భేతాళుడీ కథ చెప్పి, “రాజా, నాకొక సందేహం కలుగుతున్నది. నందుడి ఆశలు విఫలం కావడానికి కారకులెవరు? తనను నమ్మి వరం అడిగితే నందుడి కోరిక సిద్దింపజేయని దేవతా? నందుడిలో లేనిపోని ఆశ రేకెత్తించి, అతని కోసం వేచి ఉండక అతని అన్నని పెళ్ళాడిన సుందరా? అతని ఆశలకు ఆటంకంగా నిలబడిన నుండుది తల్లా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు.

“ఇందులో దేవత తప్పేమీలేదు. సుందరిని పెళ్లాడటమే నందుడుకి కావలిసినట్టయితే ఆమెను తన భార్యగా చెయ్యమని అతను దేవతను ప్రార్థించి ఉండవలసింది. నందుడా పని చెయ్యలేదు. తాను నావికుడై డబ్బు గడించి తిరిగి వచ్చేటట్టు దేవి వరమిస్తే సుందరిని పెళ్లాడటం తన చేతిలోనే ఉన్నదని అహంకరించాడు! దేవిని కొరినట్టు సంపద అనుగ్రహించింది. సుందరి తప్పుకూడా ఏమీలేదు. ఆమె నందుణ్ణే చేసుకుంటానని అన్నప్పుడామే లోకజ్ఞానం ఎరగని పసిపిల్ల. దాని కామె ఎంత మాత్రమూ బాధ్యురాలు కాదు. అతని తల్లిది కూడా తప్పు కాదు. ఆమె మొదటి నుంచీ నందుడికి హితమే చెప్పింది. నావికుడు కావద్దని, డబ్బు మీద కోరిక పెంచుకోవద్దని ఆమె చెప్పిన మాట విన్నట్టయితే సుందరిని పెళ్లాడి వుండేవాడు. తల్లి మాట వినక వెళ్ళిపోయాడు. వెళ్లినవాడు బతికి వున్నాడో లేదో, ఉంటే తిరిగివస్తాడో లేదో, వస్తే సుందరిని పెళ్లాడతాడో లేదో తల్లికి తెలియదు. ఆమెకు తన కొడుకులిద్దరి సుఖమూ కావాలి. చిన్నకొడుకు సుఖం కోసం పెద్దకొడుకు సుఖమూ, దానితో పాటు వంశగౌరవం పోగొట్టుకోవడం ఆవిడకు ఇష్టంలేదు. నందుడి దూరశే అతని చావుకు కారణం!” అన్నాడు విక్రమార్కుడు.   

రాజుకు ఈవిధంగా మౌనభంగం కాగానే భేతాళుడు శవంతో సహ మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

స్పందించండి