నిర్వాసుడి మోక్షప్రాప్తి

ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో, నిర్వా సుడనే కోపిష్టి ముని వుండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు. వెనకాముందూ చూడకుండా పెద్ద శాప మివ్వడం ఆయన అలవాటు,

ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి, రాక్షసుడివి కమ్మని శపిం చాడు నిర్వాసుడు. సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు.

సుదీపుడి మంత్రి సుకాముడు. ఆయనకు జరిగిన విషయం తెలిసింది. వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసుణ్ణి కలుసుకుని, “మునివర్యా! సుదీపుడు మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా వుండేవారు. మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై, ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు. సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురుపెట్టడం తమకు భావ్యంకాదు. దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పండి.” అని వేడు కున్నాడు.

నిర్వాసుడు మంత్రి వంక జాలిగా చూసి, “ఒకానొకప్పుడు బ్రహ్మదేవు డిచ్చిన వరాలవల్ల, ఎందరో రాక్షసులు అమిత బలవంతులై ప్రపంచాన్ని బాధిం చారు. అంటే, దేవుడివల్ల తప్పు జరిగిందనా? ప్రజలు తమ కర్మఫలం అనుభ వించవలసి వచ్చినప్పుడు, దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు; మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. నన్నూ, నిన్నూ, అందర్ని నడిపించేవాడు ఆ పైన వున్నాడు.” అని చెప్పాడు.

“మునివర్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా దేశ ప్రజల కర్మఫలం తిరిపోయే సమయం వచ్చిందేమో, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. సర్వ శక్తి మంతులైన తమరు, నాకేదైనా నివారణో పాయం సెలవిచ్చి పంపండి.” అని సుకాముడు, నిర్వాసుణ్ణి మరీ మరీ వేడు కున్నాడు.

చివరకు నిర్వాసుడు, “నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది. కాబట్టి నీకొక రహస్యం చెబుతున్నాను, విను. ఇక్కడికి ఆమడ దూరంలో కాళికాలయ మొకటి వున్నది. అందులో నిలువెత్తు కాళీ విగ్రహం సామాన్యుల గుండెలు జలదరింప చేసేటంత భయంకరంగా వుంటుంది. నీవు, ఆ విగ్రహం ముందు నిలబడి, నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైనభాగాన్ని అర్పిస్తే, మనసులోని కోరిక తీరుతుంది. వెళ్ళు!” అని చెప్పాడు.

సుకాముడు ఆమడ దూరం. ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు. అక్కడ కాళికా విగ్రహం భయంకరంగా వున్నప్పటికీ చలించక, “మాతా! నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి. అందుకుగాను, నా శరీరంలో నా కెంతో ఇష్టమైన శిరస్సును నీకు సమర్పించు కుంటున్నాను.” అంటూ ఒరలోంచి కత్తి తీసి తలను నరుక్కోబోయాడు.

అప్పుడక్కడ కనులు గొలిపే వెలుగు వచ్చింది. సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ మరు క్షణం, మానవా ! నీ దేశ భ క్తికి, సాహసానికి మెచ్చాను. నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి, అందరికీ అర్థ మయ్యే విధంగా వేయి పుటల కథను వ్రాయి. ఆ కథను చదవడం మొదలు పెడితే, మధ్యలో మానాలనిపించకూడదు. అప్పుడా కథను రాజు సుదీపుడికి వినిపించు. అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు.” అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి.

సుకాముడు కంగారుగా, మాతా ! నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంథాలు చదివాను. ప్రజోపయోగకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలు అభ్యసించాను. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో వైద్యం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు సాహిత్యంపట్ల అభిరుచి లేదు. ఒక్కగా నొక్క మహాకావ్యం కూడా చదవలేదు. ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు. నావంటి వాడివల్ల కథ వ్రాయడం వీలవుతుందా ?” అని అడిగాడు కళ్ళు మూసుకునే.

“నీకు వింటున్నకొద్దీ వినాలనిపించే లాగా కబుర్లు చెప్పడం చేతనవును కదా ! అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలని పించేలాగా పెద్దకథగా వ్రాయి . నీకథను -అన్ని వయసులవాళ్ళూ చదివి ఆనందిస్తారు. ఆ కథవల్లనే నీ రాజుకు శాప విమోచన మవుతుంది. ఇది నేనిచ్చిన వరంగా భావించి, నేను చెప్పినట్లు చెయ్యి.” అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి.

సుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి, రాత్రింబవళ్ళు కష్టించి ఒక మాసం రోజుల్లో వేయిపుటల కథను వ్రాశాడు. తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు.

రాక్షసరూపంలో వున్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుకాముడి మీదికి వచ్చాడు. సుకాముడు చలించకుండా తన గ్రంథాన్ని తెరిచి చదవడం ప్రారం భించాడు.

అంతే! సుదీపుడు మంత్రం వేసినట్లాగి పోయాడు.

సుకాముడు పుట తర్వాత పుటను చదువుతూంటే, సుదీపుడు శిలా ప్రతిమలా నిలబడి వినసాగాడు. అలా ఏకబిగిని సుకాముడు గ్రంథాన్ని చదివాడు, సుదీపుడు విన్నాడు.

చివరిపుటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి, సుకాముడి కళ్ళముందు రాక్ష సుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు. ఆయన అప్పుడు మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు.

ఆ తర్వాత రాజూ, మంత్రీ అంతఃపురా నికి వెళ్ళారు. అప్పుడు సుదీపుడు, మంత్రితో, “నువ్వు రాసిన గ్రంథం గొప్పగా వుంది. ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు వ్రాసి మమ్మల్ని ఆనంద పరుచు.” అన్నాడు.

దానికి మంత్రి, “మహాప్రభూ ! గ్రంథ రచన నావల్లకాదు. మీకు శాపవిమోచనం కలిగించాలన్న కోరికతో ఇది వ్రాశాను. ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడాలని మాత్రమే ఉపయో గించనివ్వండి. ఇలాంటి గ్రంథాలను వేరే ఎవ్వరిచేతనైనా వ్రాయించండి,” అన్నాడు.

పరిపాలనలో తనకు మంత్రి అవసరం వున్నదని గ్రహించి, సుదీపుడు తన ఆస్థానంలోని కవి, పండితులను రప్పించి సుకాముడి గ్రంథం లాంటి గ్రంథాలు వ్రాయమని కోరాడు.

వాళ్ళందరూ ఆ గ్రంథాన్ని చదివి, రాజుతో, “మహాప్రభూ! మేమేకాదు. సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్త లెవ్వరూ, ఇటువంటి గ్రంథాలను వ్రాయ డానికి ఒప్పుకోరు.” అని చెప్పారు.

ఇది విని సుదీపుడికి కోపం వచ్చింది. ఆయన సుకాముడి గ్రంథానికి వేలకొద్దీ ప్రతులు వ్రాయించి ప్రజలకు పంచి పెట్టాడు. అంతేకాక, అలాంటి గ్రంథాలు వ్రాసినవారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తానన్నాడు.

సాహితీవేత్తలెవరూ పదివేల వరహాలకు ఆశపడలేదు. కానీ కబుర్లు చెప్పడం బాగా వచ్చినవాళ్ళు మాత్రం చాలామంది ముందుకు వచ్చారు. క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి. ప్రజ లకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి. వ్రాసేవాళ్ళకవి డబ్బులు తెచ్చిపెట్టాయి. చదివేవాళ్ళకవి వినోదాన్నిస్తున్నాయి.

ఇలా కొంతకాలం జరిగేసరికి, ఆ దేశంలో కవి, పండితులకు, సాహితీవేత్త లకుఆదరణలేకుండాపోయింది. వాళ్లంతా కలిసి ఒకచోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగ డానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు.

“ఆ ముని మహా కోపిష్టి. ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి ?” అని ఒక పండితుడు అడిగాడు.

అందుకు మిగతా పండితులు ఏక కంఠంగా, “ఈ దేశంలో వుండి పనికిరాని గ్రంథాలు చదవడం కంటే, నిర్వాస మహాముని శాపానికి గురికావడమే మేలు,” అన్నారు.

వాళ్ళు సుకాముడి గ్రంథాన్ని తీసుకుని నిర్వాసమహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి తదేక ధ్యానంతో తపస్సు చేసుకుంటున్న నిర్వాస మహామునికి, వాళ్ళ కోలాహలానికి తపో భంగమయింది. ఆయన కళ్ళు తెరిచి ప్రసన్నవదనంతో వాళ్ళవంక చూసి, వచ్చిన కారణమడిగి తెలుసుకుని, సుకాముడి గ్రంథాన్ని తీసుకుని దివ్యశక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి, “సాహితీవేత్తలారా! మీ కార ణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది. నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను. కానీ కోపాన్ని విడిచి పెట్టలేక పోవడంవల్ల, నాకు మోక్షం సిద్ధించడం లేదు. నా కోపంతో నేను కొందరిచేత వాళ్ళ కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను. కానీ కొంత కాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది. అందుకు కారణం, ఈ గ్రంథమేనని ఇప్పుడర్థమవుతున్నది!” అన్నాడు.

“మహామునీ! అదెలాగో కొంచెం వివరించండి,” అని కోరాడొక పండితుడు.

“పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను. సరే, సుకాముడు వ్రాసిన ఈ గ్రంథాన్ని చదవడం రాక్షస జన్మకంటే ఘోరమైనది. అందు వల్లనే, ఏ ప్రయోజనమూలేని ఈ గ్రంథం లోని చప్పిడిమాటలు విన్న సుదీప మహా రాజు రాక్షస రూపం నుంచి విముకు డయ్యాడు. మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి, ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు; ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు! ఇక నుంచి ప్రపంచంలో మునులు, వాళ్ళ శాపాలు వుండవు—వాటిబదులు ఇలాంటి గ్రంథాలే వుంటాయి.” అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ.

ఆ క్షణంలోనే కవి పండిత సాహితీ వేత్తలందరూ చూస్తూండగా, ఆకాశం నుంచి విమానమొకటి అక్కడ దిగింది. అందులో వున్న దేవదూతలు, నిర్వాస మహామునిని ఆహ్వానించారు. ముని అక్కడ వున్నవారితో, “ఈ గ్రంథం ధర్మమా అని, నా కర్మఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను. సెలవు!” అంటూ విమానం ఎక్కాడు.

స్పందించండి