దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శ ప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా, ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే ఉంటూవుండేది.
ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యవంలో పుత్రకామేష్టియాగం చేయించాడు.
ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను, ఋషులను నానా హింసలు పెడుతూండేవాడు. ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలసి, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో – “మహాప్రభో! ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు” అని మొరపెట్టుకున్నారు. అందుకు శ్రీమహావిష్ణువు మందహాసంతో… “సరే! నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి, రావణుని సంహరిస్తాను” అని అభయం ఇచ్చాడు.
ఋష్యశృంగ ముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి, దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, “నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్యపాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు. నీ కోరిక ఈడేరుతుంది” అన్నాడు.
దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇచ్చాడు. కాలక్రమాన దైవాంశ సంభూతులైన నలుగురు పుత్రులు వారికి కలిగారు. శ్రీమహావిష్ణువే రాముడుగా అవతరించి కౌసల్యకు జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడుగా సుమిత్రకు జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయింది. సుమిత్రకు శత్రుఘ్నుడు రెండో కుమారుడు.
శ్రీరాముడు జన్మించిన ఆ రోజును ‘శ్రీరామనవమి’ అనే పండుగదినంగా ప్రజలు నేటికీ వేడుకతో జరుపుకుంటారు.