తాటక వధ

తండ్రి దశరథుడి ఆశీస్సులతో, రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, “రామా! దండకారణ్యం! ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి, తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది.

ఈ తాటకకు వెయ్యి ఏనుగుల బలం ఉంది. దాని భయంతో ఎవ్వరూ ఈ దారిన వెళ్ళడానికి సాహసించరు. ముందు ఈ రాక్షసిని వధించు” అన్నాడు. స్త్రీ కదా అని రాముడు సంకోచిస్తూండగా, విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలన్న తండ్రి మాటను పాటిస్తూ, ధనుష్టంకారం చేశాడు.

ఈ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూ యిటూ పారి పోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక, ‘తనను కవ్వించగల ధైర్యశాలి ఎవడా?’ అని ఆశ్చర్యపోయింది. పెడబొబ్బలు పెడుతూ అది రాముడి మీదకి వచ్చిపడింది. మాయా యుద్ధంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశిలలు, వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తిమంతమైన బాణంతో తాటకను వధించాడు. విశ్వామిత్రుడు మహదానంద భరితుడయ్యాడు. తాను కఠోర తపస్సు ద్వారా సంపాదించిన మహిమాన్వితమైన దివ్య అస్త్రాలన్నింటిని రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ, ఉపసంహార మంత్రాలు నేర్పించాడు.

తరువాత ముగ్గురూ కలిసి విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి చేరుకొన్నారు. అక్కడున్న ఋషులు రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు మౌనవ్రతం దాల్చి, ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఋషుల ప్రార్థన మేరకు రామలక్ష్మణులు ధనుర్భాణాలు చేతపట్టి రాత్రింబవళ్ళు యాగరక్షణకు పూనుకొన్నారు. ఇలా ఆరు రోజులు నిర్విఘ్నంగా గడిచిపోయాయి. చివరి రోజైన ఏడవనాడు యజ్ఞం సంపూర్ణమయ్యే సమయంలో ఆకాశంలో పెద్దపెద్ద చప్పుళ్ళు వినబడ్డాయి. రాముడు తల ఎత్తి చూసేసరికి క్రూరరాక్షసులైన మారీచ, సుబాహులు తమ అనుచరులతో ఆకాశంలో నిలబడి కనిపించారు. వారు రక్తం, మాంసం మొదలైన అశౌచ్యాలను యజ్ఞకుండంలో పోసి యజ్ఞాన్ని పాడు చెయ్యడానికి తయారై వున్నారు. వాళ్లను ఎదుర్కోవడానికి రామలక్ష్మణులు సిద్ధపడ్డారు. రాముడు ఒక దివ్యాస్త్రాన్ని వాళ్ళపై ప్రయోగించి వారి ప్రయత్నాన్ని భంగపరిచాడు. రాముని ఒక బాణం మారీచుణ్ణి సహస్రయోజనాల సుదూరానికి నెట్టి సముద్రంలోకి పారవేసింది; మరోబాణంతో సుబాహుని ప్రాణాలు తీశాడు. ఈలోపుగా లక్ష్మణుడు మిగిలిన రాక్షస అనుచరులందరినీ కడతేర్చాడు. విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తిగావించి, రామ లక్ష్మణులను ఆశీర్వదించాడు.

స్పందించండి