అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం

నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు.

ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. దశరథుడు సముచితరీతిన అర్ఘ్య పాద్యాలిచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. “మీ రాక వల్ల నేను ధన్యుడి నయ్యాను. ఏ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం కలిగితే చరితార్థుడినవుతాను” అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు, “మహారాజా! మంచిది. కొంతమంది రాక్షసులు నా యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని హత మార్చడానికి రాముణ్ణి నాతోపాటు పంపాలి” అన్నాడు.

ఆ మాటలకు మూర్ఛపోయినంత పనయింది దశరథుడికి! ‘ముక్కు పచ్చ లారని రాముడినా ఆ క్రూర రాక్షసులను చంపడానికి పంపడం! బాలరాముడు ఇలాంటి పనికి ఎలా సమర్థుడౌతాడు? అని ఆలోచించ సాగాడు.

కాని విశ్వామిత్రుడు తన పట్టు వదలలేదు. చివరికి వసిష్ఠుడు జోక్యం చేసుకుని, రాముడు క్షేమంగా విశ్వామిత్రుడితో తిరిగి రాగలడని భరోసా ఇచ్చి, దశరథుడి మనస్సు కుదుట పరిచాడు.

స్పందించండి