త్రిజటుడని పేద బ్రాహ్మణుడు పుండేవాడు. చాలా మంచివాడు. శాస్త్రం తెలిసినవాడు. కాని బహు కుటుంబీకుడు. అడవులకు వెళ్ళి పళ్ళూ, దుంపలూ ఏరి తెచ్చుకుంటుండేవాడు. రాముడు తనకున్న సర్వస్వం విప్రులకు దానం చేస్తున్నాడని తెలిసి ఆదరాబాదరా ఆయన దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి “రామయ్య తండ్రీ! నేను ఆగర్భ దరిద్రుణ్ణి, పిల్లలు గలవాణ్ణి, నాకేమైనా ఇచ్చి పుణ్యం గట్టుకో”
అని అడిగాడు.
“బ్రాహ్మణో త్తమా! ఇప్పటివరకూ ఎన్నోవేల ఆవులిచ్చాను. నీకొక్కటీ దక్కలేదా?” అని అడిగాడు రాముడు.
లేదని తల అడ్డంగా వూపాడు బ్రాహ్మణుడు. “అయితే ఒక పని చెయ్యి. ఈ కర్ర పుచ్చుకుని నీ శక్తికొద్దీ విసురు. అది ఎంత దూరాన పడితే అంతమేరా వున్న ఆవులు నీకు దానమిస్తాను అన్నాడు దాశరథి.
విప్రుడు తుండుగుడ్డ నడుముకు బిగించి పళ్ళు బిగబట్టి ఆ కర్ర విసిరేశాడు. ఇక్కడా అక్కడా కాదు- అది వెళ్ళి సరయూ నది ఒడ్డున పడింది. రాముడు నవ్వి ఆ ప్రాంతాన వున్న గోవులన్నీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అలా అందరికీ దాన ధర్మాలు చేసి వారిని తృప్తిపరిచాక పురజనుల దగ్గర సెలవు పుచ్చుకుని సీతారామలక్ష్మణులు అడవులకు ప్రయాణమయ్యారు.
అయోధ్యా నగర వాసులందరూ కంటకడి పెట్టారు. రథం బయలుదేరింది. వెళ్ళి వెళ్ళి గంగానది చేరుకుంది.
అక్కడో చెట్టు వుంది. దాని నీడన రాముడూ, సీతా, లక్ష్మణుడు కూర్చున్నారు. కిరాతకులకు రాజైన గుహుడికీ సంగతి తెలిసింది. అతనికి రాముడే దైవం . రాముడే ప్రాణం. రాముడికి తెలుసా సంగతి. గబగబ వెళ్ళి రాముడి పాదాలు అంటి, ఫలహారం ఆర్పించాడు గుహుడు. ఆ తరువాత వారిని తన పడవలోకి ఎక్కించి గంగానది దాటించాడు. వాళ్ళు చిత్రకూట పర్వతం చేరుకున్నారు.
తాతగారింట్లో వున్న భరతుడికి విషయమంతా తెలిసింది. ధర్మమూర్తి అయిన శ్రీరాముడికి వచ్చిన కష్టం తలుచుకుని దుఃఖపడ్డాడు. అన్నగారి కష్టాలకు కారకులైన తన తల్లిని పలువిధాల నిందించాడు. తమ్ముడు శతృఘ్నుణ్ణి తోడు తీసుకుని రాముడ్ని వెతుకుతూ అరణ్యాలకు వెళ్ళాడు. చిత్రకూటంలో వున్న అన్నా వదినలను దర్శించాడు.
“అయోధ్యకు నువ్వే రాజుని. నీ ప్రజలను నువ్వే పాలించుకో. వచ్చి పట్టాభిషేకం చేసుకో. నా తల్లి మాట విని మన తండ్రి ఈ పాపపు పని చేశాడు. నువ్వు అడవులకు రాగానే ఆయన కాస్తా కన్నుమూశాడు. నా
తల్లి ఇంత దుర్మార్గానికి ఎందుకు పూనుకుందో ఇప్పటికీ నాకు తెలీటంలేదు. కాని, నా మాట విను. నీ రాజ్యం మీద నాకు అధికారం లేదని చెప్పటానికి వచ్చాను. నీ రాజ్యం నువ్వేలుకో” అని బ్రతిమాలాడు.
పితృ వాక్య పరిపాలన తన కర్తవ్యమనీ, అయోధ్యకు రాననీ రాముడు కరాఖండీగా తమ్ముడితో చెప్పాడు.
“పోనీ, నీ పాదుకలియ్యి. అవే రాజ్యం ఏలుకుంటాయి” అని కోరాడు భరతుడు. వీల్లేదన్నాడు రాముడు.
ఎన్ని చెప్పినా వినకపోయేసరికి చివరికి తన పాదుకలు ఇచ్చాడు శ్రీరాముడు. అవి నెత్తిన పెట్టుకుని నందిగ్రామం వెళ్ళి వాటిని సింహాసనం మీద వుంచి రాముడి ప్రతినిధిగా భరతుడు పరిపాలన చేయసాగాడు.
రామభద్రుడు సీతాలక్ష్మణులతో చిత్రకూటం నుండి దండకారణ్యానికి వెళ్ళాడు అక్కడ విరాధుడనే రాక్షసుడు కనిపించాడు. రాముడికీ వాడికీ యుద్ధం జరిగింది. విరాధుడు చిత్తుగా ఓడిపోయాడు. తరువాత రాముడు శరభంగ మహర్షినీ, సుతీష్ణ మహర్షినీ, అగస్త్య మహర్షినీ దర్శించి పూజించాడు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని సతీ సోదర సమేతంగా అక్కడ ఉంటూ వచ్చాడు.
రావణాసురుని చెల్లెలు శూర్పణఖ దండకలో తిరుగుతూ ఒక రోజు రాముణ్ణి చూసి అతని అందచందాలకు ముగ్ధురాలై తనను పెళ్ళి చేసుకోమని కోరింది. శూర్పణఖ చాలా వికృత స్వభావి. బుద్ధిని అనుసరించే రూపం పున్నదామెకు. ఏ రూపు కావాలంటే ఆ రూపం పొందగలదు. రాముడు ఆమెను తిరస్కరించాడు.
అన్న ఆనతి మేరకు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. అడవంతా గగ్గోలు పెట్టేస్తూ పారిపోయిందామె. ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే ముగ్గురు రాక్షసులు దండకారణ్యం ఏలుతున్నారు. వాళ్ళ చేతికింద పధ్నాలుగు వేలమంది రాక్షసులున్నారు. శూర్పణఖ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. వాళ్ళు రాముడి మీదకు యుద్ధానికి వెళ్ళి హతులయ్యారు.
తనకు పరాభవం జరగడం, తన వాళ్ళందరూ చనిపోవడంతో ఆ దుఃఖం భరించలేక శూర్పణఖ తన పెద్దన్న రావణుడి దగ్గర మొర పెట్టుకుంది.
“దండకారణ్యంలో నాకు ఒక స్త్రీ కనబడింది. పక్కన ఆమె భర్త కూడా పున్నాడు. ఆమె అప్సరస. అంత అందగత్తె పృధ్విమీద మరి లేదు. ఆమె నీకు తగినది. నువ్వు చేపట్టిననాడే ఆ అందానికి అర్థం. ఆమెను నీ దగ్గరకు తీసుకువద్దామని వెళ్తేనే ఆమె భర్తా, మరిదీ నన్నిలా చేశారు. నన్ను రక్షించబోయిన వాళ్ళందర్నీ కూడా చంపేశారు” అని కల్పించి విషయాన్ని వక్రీకరించి చెప్పింది. లంకేశ్వరుడు ఉగ్రుడయ్యాడు.