కామ్యకవనంలో పాండవులు వనవాసక్లేశం అనుభవిస్తూ వుండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్ళాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించారు.
“పాంచాలి వలె పరాభవాలు పొందిన రాకుమారిగాని, నావలె కారడవులలో కష్టాలు అనుభవించిన రాజపుత్రుడు గాని ఏకాలంలోనైనా వున్నారా మహర్షీ?” అంటూ ధర్మరాజు దుఃఖించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి రఘురాముడి కథ చెప్పాడు.
అయోధ్యా నగరంలో ఇక్ష్వాకు వంశం అనే ఒక గొప్ప వంశం వుంది. కోసల దేశానికి రాజధాని ఆ నగరం. దశరథుడు పరిపాలిస్తుండేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వారిలో కౌసల్యకు శ్రీరాముడు, కై కేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శతృఘ్నులనే కవల పిల్లలు జన్మించారు.
శ్రీరాముణ్ణి గురించి తెలియని వారెవ్వరూ వుండరు. బుద్ధిమంతుడు. నీతి తప్పనివాడు. ధర్మాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. చాలా బలవంతుడు. చేసిన మేలు మరిచిపోనివాడు. సత్యసంధుడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా మాట్లాడటం బహుశః అతనికొక్కడికే తెలుసేమో! అతను పలికినంత మృదువుగా, చక్కగా ఎవరూ మాట్లాడలేదు. గొప్ప తేజశ్శాలి. అసూయ లేనివాడు. రుజువర్తనం కలిగిన
వాడు. సంగీత ప్రియుడు, వీరాధి వీరుడు, ధీరుడు, శూరుడు, విలువిద్యలో నేర్పరి. అతని వక్షస్థలం చాలా విశాలం. చేతులు చాలా పొడుగు. అతను మాట్లాడితే ఖంగున మోగుతుంది స్వరం, సుందర వదనం. విశాలమైన నుదురు. చెంపకి చారడేసి కళ్ళు అతనివి.
గొప్ప జ్ఞాని అతను. శుచిగా, శుభ్రంగా వుంటాడు ఎప్పుడూ. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చెయ్యవలసిన పని చేయక మానడు. చేయరానిని ససేమిరా చెయ్యడు. ఎవరినీ ధర్మం తప్ప నివ్వడు. గాంభీర్యం చెప్పవలసివస్తే సముద్రమే సాటి. అతనికి కొండంత ధైర్యం. కోపం వచ్చిందా ఆగ్గయిపోతాడు. సకల సద్గుణాభిరాముడు. ఇన్నెందుకు – అతన్ని చూసి ముచ్చటపడాల్సిందే తప్ప చెబితే తనివి తీరదు.
ఆ రాముడంటే తండ్రికి ప్రాణం. రాముణ్ణి చూడకుండా క్షణం కూడా వుండలేడాయన. కొడుకుని తన తరువాత తన అంతటి వాణ్ణి చెయ్యాలనుకున్నాడు దశరథుడు. అందుకోసం రాముణ్ణి ముందు యువరాజును చెయ్యాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. ముహూర్తం స్థిరపరిచాడు. కైకేయి ఆంతరంగిక సేవకురాలు మందరకీ విషయం తెలిసింది. దుష్టబుద్ధి గలది. వెంటనే కైకేయి దగ్గరకు వెళ్ళి
“మహారాజుకు నువ్వంటే ఇష్టమై వుండి కూడా ఆ కౌసల్య కొడుకుకే పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీకూ, నీ భరతుడికీ కష్టాలే గతి. మహారాజు నిన్ను ప్రేమతో మోసం చేశాడు. అవేవీ తెలియక తెల్లనివన్నీ పాలనీ, నల్లనివన్నీ నీళ్ళనీ నువ్వు భ్రమపడ్డావు” అని దుర్బోధ చేసింది.
కై కేయి నిజమే అనుకుంది.
విసవిస పడకగదిలోకి వెళ్ళి అలంకారాలూ, ఆభరణాలూ తీసేసి, జుట్టు విరబోసుకుని, పాత నూలు చీర చుట్టపెట్టుకుని రాని ఏడుపు ఏడుస్తూ పడుకుంది.
కాసేపటికి దశరథుడు వచ్చాడు. కోప కారణం చెప్పమని అడిగాడు. “రాముడికి పట్టాభిషేకమా? వల్లకాదు” అంది.
ఆ మాటలు వినగానే దశరథుడు నేల కొరిగాడు.
అదివరలో దశరథుడు కైకకు రెండు వరాలిచ్చి వున్నాడు. అవి వుపయోగించుకునేందుకు తగిన సమయం వచ్చిందనుకుంది కైక.
నా వరాలు నాకు తీర్చమని కూర్చుంది.
“ఒకటి—రాముణ్ణి అడవులకు పంపేయడం” అంది. రాముడు పధ్నాలుగేళ్ళు అడవిలో వుండాలని ఆక్ష విధించింది.
“రెండోది నా కొడుకయిన భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం” అంది. ఇలా చెయ్యకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను” అని చెప్పేసింది గట్టిగా.
దశరథుడు చాలా బ్రతిమాలాడా మెని.
రాముడు లేకుండా తను బ్రతకలేనన్నాడు. లోకం రామరాజ్యం కోసం ఎదురుచూస్తోందన్నాడు. మంచి చెడ్డలు వివరించాడు. ధర్మాలు చెప్పాడు.
“ఇది తప్ప మరే కోరిక కోరినా క్షణాలమీద తీరుస్తాన”న్నాడు.
మాట్లాడక ముఖం ముడుచుకు నిలబడితే కసిరాడు. మళ్ళీ సాదరంగా అనునయించాడు. తన మాట కాదనేసరికి నిందించాడు. దూషించాడు. చేతులు జోడించి అర్ధించాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. కాని లాభం లేక పోయింది. తనమాటే చెల్లాలంది కైక. మంకుపట్టు పట్టింది.
ఇంతలో రాముడికీ విషయం తెలిసింది. తండ్రిని సత్యసంధునిగా నిలపడం తన కర్తవ్యమనుకున్నాడు. తన మూలంగా తల్లికిచ్చిన వరాలు తీర్చలేక తన తండ్రి నిందల పాలవడం యిష్టంలేక పోయింది రాముడికి.
అడవులకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.
లక్ష్మణుడు వెళ్ళక్కర్లేదన్నాడు ఎవరైనా నోరు మెదిపితే పీక నొక్కేస్తా నన్నాడు. ఆయుధం పడితే నాకు అడ్డేమిట్టన్నాడు. కౌసల్య గుండె పగిలేలా ఏడ్చింది. అయినా వెళ్తానన్నాడు రాముడు. ఇది విన్నది సీత, “నేను కూడా మీ వెంట అడవులకు వస్తా” అంది భర్తతో. రాముడు వద్దన్నాడు. “రాకుండా వుండను. నేను చిన్న పిల్లగా వున్నప్పుడే నన్ను పెళ్ళి చేసుకున్నారు మీరు. అప్పటి నుంచి మీ దగ్గిరే వున్నాను నేను. మీ సఖ్యం లేకుండా వుండలేను. ఎక్కడికైనా వెళ్ళండి. నాకు అభ్యంతరం లేదు. కాని మీ వెంటే వుంటాను నేను” అంది.
“అడవుల్లో తిరగడం కష్టం” అన్నాడు రాముడు. “మిమ్మల్ని విడిచి వుండటమే పెద్ద కష్టం నాకు” అంది సీత. చేసేది లేక సరేనన్నాడు రాముడు.
ఇదంతా చూశాడు లక్ష్మణుడు. “నేనూ మీతోనే వస్తా” అన్నాడు. అన్న కాదనేవరికి పాదాలు పట్టుకున్నాడు. “నా బతుకంతా నీతోనే ముడిపడి వుంది. నీవు లేని అయోధ్య నాకు వల్లకాడు. దేవలోకమైనా నాకు అక్కరలేదు” అన్నాడు.
“సరే, నువ్వు కూడా రా” అనుమతించాడు రాముడు లక్ష్మణుణ్ణి, ముగ్గురూ కట్టుబట్టలతో బయలుదేరారు.