వందే వాల్మీకి కోకిలం – 3

రావణాసురుడు వీరుడు. గొప్ప శివభక్తుడు. చెల్లెలు చెప్పిన మాటలు విని రాముణ్ణి నమిలి మింగెయ్యాలన్నంత మండిపడిపోయాడు. వెంటనే మారీచుడనే మరో రాక్షసుడి దగ్గరికి వెళ్ళి “ఎవరో రాముడట. ఈ అడవుల్లోనే వున్నాడు. నా చెల్లెలిని పరాభవించాడు. అతని మీదకు యుద్ధానికి వెళ్తున్నాను. నువ్వు నాకు సాయం చెయ్యాలి” అని కోరాడు. మారీచుడు వద్దన్నాడు. “నువ్వీపని చెయ్యవద్దు. రాముణ్ణి గురించి నీకు తెలీదు. మహావీరుడతను. అతణ్ణి నువ్వు జయించలేవు. అతనితో వైరం నీకు చేటు తెస్తుంది. నువ్వు చెడిపోరాపు” అని గట్టిగా చెప్పాడు. అయినా రావణుడు వినిపించుకోలేదు. “నువ్వు నాకు సాయం చేసి తీరవల్సిందే. లేకపోతే నీ తల తెగవేస్తా” అన్నాడు. రాక్షసులందరికి రావణుడు రాజు. అందుచేత అతను చెప్పినట్టు చెయ్యడానికి సిద్ధపడ్డాడు మారీచుడు. ఇద్దరూ ఆలోచించారు.

మారీచుడు బంగారు లేడిలా మారిపోయాడు. చుక్కలు చుక్కల లేడిలా తయారయ్యాడు. సూది కొమ్ముల లేడి అయిపోయాడు. వయ్యారాలు పోతూ రాముడున్న పర్ణశాల దగ్గరికి వెళ్ళాడు. ఆ కాంచనమృగాన్ని చూసింది సీత. “నాకా లేడి కావాలి” అంది. తెస్తానని బయలుదేరాడు రాముడు. వెళ్ళిన మనిషి ఎంత సేపటికీ తిరిగి రాకపోయేసరికి “వెళ్ళి మీ అన్న ఎక్కడున్నాడో చూసి తీసుకు రా” అని లక్ష్మణుడ్ని పంపింది సీత. అదే సరైన సమయమనుకొని రావణుడు సన్యాసి వేషం ధరించి సీతను అపహరించుకు పోవాలన్న చెడ్డతలంపుతో పర్ణశాలను సమీపించాడు.

సీత అతన్ని చూసి “అయ్యా! మా యింటికి అతిథిగా వచ్చారు. నేను ఇచ్చే అర్ఘ్య పాద్యాలు అందుకుని కంద మూలాలు స్వీకరించండి” అంది. కపట సన్యాసి వికటాట్టహాసం చేశాడు. తన నిజరూపం చూపి సీతను ఆకాశ మార్గాన ఎత్తుకుపోయాడు.

జటాయువు అని ఒక గద్ద చాలా పెద్దది. చాలా ముసలిది. కాని బాగా బలమైనది. అది సీత నెత్తుకు పోతున్న రావణుణ్ణి చూసింది. అతన్ని అడ్డుకుంది. ముక్కుతో పొడిచి, రెక్కలతో కొట్టి, కాళ్ళతో తన్ని, గోళ్ళతో రక్కి, రావణుని శరీరమంతా గాయపరిచింది. అతను కోపం పట్టలేక తన ఖడ్గంతో జటాయువు రెక్కలు తెగ్గొట్టాడు. అది కాస్తా నేలకొరిగింది. రావణుడు సీత నెత్తుకుని వెళ్ళి పోయాడు.

అక్కడ మాయలేడి అయివచ్చిన మారీచుణ్ణి చంపి పర్ణశాలకు తిరిగి వెళ్ళాడు రాముడు. లక్ష్మణుడు మార్గ మధ్యంలో ఎదురు పడ్డాడు. సీత మాత్రం కనిపించలేదు. ఎంతో సేపు వెతికారిద్దరూ. ఎక్కడా కనిపించక పోయేసరికి రాముడు సీత కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అలా దుఃఖపడుతూనే సీతను వెతుకుతూ
ముందుకు వెళ్ళారు రామ లక్ష్మణులు.

కొంచెం దూరం వెళ్ళేసరికి నెత్తుటి మడుగులో కొనవూపిరితో కొట్టుకుంటూన్న జటాయువు కనిపించింది వాళ్ళకి. రావణుడు సీతను ఎత్తుకుపోయాడని చెప్పి ప్రాణాలను విడిచిందది. రామలక్ష్మణులు దానికి అగ్ని సంస్కారం చేసి సీతను అన్వేషిస్తూ మరికొంత దూరం వెళ్ళేటప్పటికి కబంధుడనే మరో రాక్షసుడు ఎదురైనాడు. వాడికి తల మెడమీద లేదు. కడుపు మీద వుంది. చేతులు దూలాల్లా పొడుగ్గా వున్నాయి. రాముడు వాణ్ణి హతమార్చాడు. వాడు చనిపోతూ “రామా! నేను విశ్వాసుడనే గంధర్వుణ్ణి. నీవల్ల శాప విముక్తి కలిగింది నాకు. మాతంగ పర్వతాన సుగ్రీవుడని ఒక దానవ వీరుడున్నాడు. అతనితో స్నేహం చేసుకో. అతను నీకు చాలా సహాయం చేస్తాడు” అని చెప్పాడు.

రామలక్ష్మణులు పంపా సరస్సు చేరుకున్నారు. చాలా చక్కని సరస్సది. హనుమంతుడు మొట్టమొదట రాముణ్ణి అక్కడే కలుసుకున్నాడు. హనుమంతుణ్ణి సాయం తీసుకుని రాముడు మాతంగపర్వతం వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు.

వాలీ సుగ్రీపుడూ వానరులు. గొప్ప వీరులు. ఇద్దరూ అన్నదమ్ములు. వాలి వానరులకు రాజు. అతను తన తమ్ముణ్ణి చాలా బాధించాడు. తమ్ముడి భార్యను చెరబట్టాడు. ఇదంతా సుగ్రీవుడు రాముడితో చెప్పుకున్నాడు. సాయం చేయమని అర్ధించాడు. సరేనన్నాడు రాముడు.

“వాలిని సంహరిస్తా. నీ భార్యను నీ కప్పగిస్తాను. వానర రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను” అని మాట ఇచ్చాడు. కాని సుగ్రీవుడికి నమ్మకం కుదరలేదు. తన అన్నగారి ముందు ఎవరూ నిలబడలేరని అతని నమ్మకం. సుగ్రీవుడి అనుమానం పసిగట్టేశాడు రాముడు.

చిన్నగా నవ్వాడు.

స్పందించండి