దుందుభి అని ఒక రాక్షసుడు పుండేవాడు. ఒకప్పుడు వాలితో యుద్ధానికి తలపడ్డాడు.
వాలి వాడిని అవలీలగా చంపి అల్లంత దూరానికి కళేబరాన్ని విసిరేశాడు. అది వెళ్ళి మాతంగ పర్వతం మీద పడింది. ఆ ఎముకల గుట్ట అలాగే వుంది. సుగ్రీవుడు వెంటరాగా రాముడు మాతంగ పర్వతం మీదకు వెళ్ళి ఆ ఎముకల గుట్టను వామపాదపు బొటన వేలితో ఆకాశంలోకి విరజిమ్మాడు. అప్పుడు సుగ్రీవుడికి దాశరథి శ క్తి అర్థమయింది.
సుగ్రీవుడూ, రాముడూ కిష్కింధకు బయలుదేరారు. కొండంత అండగా కోదండ రాముడున్నాడన్న ధైర్యంతో పురద్వారం బయట నుంచుని పెద్దగా అరిచాడు సుగ్రీవుడు. ఆ గావుకేకకి నగరమంతా దద్దరిల్లింది. ఉలికిపడ్డాడు వాలి.
“ఎవడపురా నువ్వు?” అని గద్దిస్తూ బయటకు వచ్చాడు.
అన్నదమ్ములిద్దరూ యుద్ధానికి దిగారు.
వాలి సుగ్రీవులకు భయంకరంగా పోరాటం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ఒకే రూపురేఖలు కలవారవడం చేత వాలి ఎవరో ఎంత ప్రయత్నించినా గుర్తించలేక పోయాడు రాముడు.
అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి మెడలో పూలహారం వేశాడు. హారం లేనివాడు వారి అని రాముడికి చెప్పాడు. వెంటనే ఆయన వింటిని ఎక్కు పెట్టి ఒక్క బాణం సంధించి విడిచాడు. ఆ ఘాతానికి వాలి ప్రాణాలు వదిలాడు. సుగ్రీవుడు తన భార్య రునును తిరిగి పొంది వానర రాజ్యం చేపట్టాడు. అప్పుడు మైథిలి ఎక్కడ ఉందొ చూసి రమ్మని కోట్లకొద్దీ వానర వీరులను నాలుగు దిక్కులకూ పంపించాడు.
హనుమంతుడూ, అంగదుడూ, జాంబవంతుడూ, నీలుడూ మొదలైన వానర వీరులు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల వెతికారు. ఫలితం లేకపోయింది. విసిగిపోయారు. అప్పుడు వారికి జటాయువు అన్నగారు సంపాతి కనిపించింది. సీత లంకలో వుందన్న సంగతి అది చెప్పింది వానర వీరులకి.
దక్షిణ సముద్రంలో ఒక దీవి వుంది. లంక అని పేరు దానికి. రాక్షసరాజు రావణుడి రాజ్యమది. ఆ రావణుడే సీతను మోసగించి అపహరించుకు పోయాడు. లంకలో ఆశోక వనం వుంది. చాలా అందమైన పూదోట అది. అందులో లేని పూల మొక్కలూ, తీగలూ, పళ్ళచెట్లూ మరెక్కడా లేవు. సీతను ఆ చెట్ల మధ్య బంధించాడు రావణుడు. అహర్నిశలూ రాముణ్ణి తలుస్తూ నిద్రాహారాలు లేక చిక్కి శల్యమై క్షణమొక యుగంగా గడుపుతోంది సీత. భయంకర రాక్షస స్త్రీలు ఆమెకు కాపలా కాస్తున్నారు.
హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. రావణుని పురవైభవం అంతా ఇంకా కాకుండా వుంది. సీత కోసం రావణుని అంతఃపురమంతా కలయచూశాడు. ఆ రాచ నగరి శోభ సౌందర్యప్రియుడైన ఆంజనేయుని అబ్బుర పరిచింది. పురమంతా గాలించాడు. చివరికి అశోక వనంలో రాముడి ధర్మపత్ని కనిపించింది.
ప్రభువు ఇచ్చిన ఉంగరం ఆమెకు ఆసనాలుగా యిచ్చి “నేను రామదూతను. సుగ్రీవుని బంటును. హనుమంతుడు నా పేరు. త్వరలోనే రాముడు వచ్చి నిన్ను తనతో తీసుకు వెళ్తాడు. నా మాట నమ్ము” అని ధైర్యం చెప్పి రఘురాముడి గుణగణాలు వర్ణించాడు. రాముడు క్షేమంగా వున్నాడనీ, తనకోసం చింతిస్తున్నాడని, తనను తీసుకు వెళ్ళేందుకు వస్తున్నాడనీ తెలిసి సంతోషించింది సీత. తన గుర్తుగా రాముని కిమ్మని చూడామణి అన్న తన నగ ఒకటి హనుమంతుడికి ఇచ్చింది.
తరువాత హనుమంతుడు అశోకవనం అంతా పాడు చేశాడు. అది చూసి అక్కడ కాపలా వాళ్ళు అతని మీద పడ్డారు. వాళ్ళనందరినీ హనుమంతుడు చిత్తు చిత్తు చేశాడు. రావణుని సేనాధిపతులనూ, మంత్రుల కొడుకులనూ చంపాడు. రావణుని కొడుకుల్లో ఒకడైన అక్షుణ్ణి కూడా హతమార్చాడు. లంకాపట్నం అంతా
గగ్గోలెత్తింది. ఒక కోతి రాక్షస సంహారం చేయడం వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించింది.
రావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు హనుమంతుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రావణుడికి ప్రత్యక్షంగా బుద్ధి చెప్పాలనిపించింది రామ బంటుకి. స్వయంగా లంకేశుని శక్తి సామర్ధ్యాలు చూడాలనుకున్నాడు. అతడు చేసిన పని ఎంత నీచమైనదో తెగబడి చెప్పాలనుకున్నాడు. ఓటమిని నటిస్తూ రాక్షస మూకకి లొంగిపోయాడు. రాక్షసులు హనుమంతుణ్ణి తాళ్ళతో కట్టి రావణుని సన్నిధికి తీసుకుపోయారు. హనుమంతుణ్ణి చూసి మండిపడ్డాడు రావణుడు.
“నిన్ను దేవేంద్రుడు పంపాడా?”
“ఊహు”
“యముడు? వరుణుడు? విష్ణుమూర్తి?”
తల అడ్డంగా తిప్పాడు హనుమంతుడు.
“మరి ఎవరు పంపించారు?”
“నా పేరు హనుమంతుడు.”
“నీ పేరు కాదు నేను అడిగింది. నిన్నెవరు వంపారని?”
“నేను రాముని దూతను. నేను వానరుణ్ణి. సుగ్రీపుడు పంపాడు నన్ను. వాలి తమ్ముడు సుగ్రీవుడు తెలుసనుకుంటాను నీకు. వాలి రాముని చేతిలో చచ్చిపోయాడు. రాముడు వేసిన ఒకే ఒక్క బాణంతో
హరీ అన్నాడు. రాముడే సుగ్రీవుడికి వానర రాజ్యం అప్పగించాడు. రుమను సుగ్రీవునికి కూర్చాడు. ఆ రాముని ఆజ్ఞమీద సుగ్రీవుడు నన్ను ఇక్కడకు పంపాడు.”
అంతా విని రావణుడు వికటాట్టహాసం చేశాడు.
“రాముడి సంగతి తెలీదు నీకు. ఆయన భార్య సీతను అపహరించి తెచ్చాపు నువ్వు. సీత సామాన్య స్త్రీ కాదు. ఆమె నీ పాలిటి యమపాశం. ఆ పాశాన్ని కంఠాన తగిలించుకుని తిరుగుతున్నావు. రాముని భార్యను రాముడికి ఇచ్చెయి. అతని కాళ్ళ మీద పడు. క్షమించమని వేడుకో. బ్రతికిపోతావు. ఇది ప్రార్థన కాదు. హెచ్చరిక కూడా కాదు. నీ మంచికోరి హితవు చెబుతున్నాను. గొప్ప రాజువు నువ్వు. చాలా గొప్ప రాజ్యం నీది. మంచి వంశం నీది. గొప్ప శూరుడపు నువ్వు. ఒక్క స్త్రీ కోసం సర్వనాశనం పొందడం నీ వంటి వాడికి మంచిది కాదు” అని చాలా గట్టిగా చెప్పాడు హనుమంతుడు. అప్పుడు రావణుడు అరిచిన అరుపుకి భూమి గజగజలాడింది. భృత్యులను పిలిచి “వీణ్ణి నరికెయ్యండి” అని ఆజ్ఞాపించాడు రావణుడు.