వందే వాల్మీకి కోకిలం – 5

విభీషణుడు రావణుని తమ్ముడు. చాలా మంచివాడు. హనుమంతుడి మీదకు కాలు దువ్వటం మంచిది కాదని అన్నకు హితవు చెప్పాడు. “దూత లేకపోతే ఏ రాజూ రాజ్యం చెయ్యలేడు. నువ్వూ అంతే. దూతలూ, రాయబారులూ లేకపోతే రాచకార్యాలన్నీ నిలిచిపోతాయి. హనుమంతుడు రాముని దూత. దూతని సంహరించటం మంచిది కాదని పెద్దలు చెబుతారు” అన్నాడు.

ఆ మాట మీద కొంచెం నిదానించాడు లంకేశ్వరుడు. కాని కోపం పూర్తిగా పోలేదు. “వీడి తోకకు నిప్పంటించి నగర వీధుల్లో వీడ్ని తిప్పండి” అని ఆజ్ఞాపించాడు చివరికి.

రాక్షస భటులు హనుమంతుడ్ని చుట్టుముట్టారు. అతని తోకకు నూనెతో తడిపిన గుడ్డలూ, గోనె సంచులూ చుట్టారు. నిప్పంటించారు. వీథుల్లో తిప్పారు. వెక్కిరించారు. గేలి చేశారు.

రాక్షస స్త్రీలకూ, పిల్లలకూ ఇదంతా ఓ వినోదంగా వుంది. ఒకర్నొకరు తోసుకుంటూ విరగబడి చూశారు. హనుమంతుడు అదంకా సహించాడు. ఇంతలో తోకకు నిప్పు అంటుకుంది. మంటలు బాగా లేచాయి. కోపంతో ఒక్క వురుము వురిమాడు ఆంజనేయుడు. దభీమని అంతెత్తుకు ఎగిరి మేడలు, మిద్దెలు, గోపురాలు అన్నిటికీ నిప్పంటించాడు. దొరికిన వాళ్ళను దొరికినట్టు ఆ మంటల్లోకి తోశాడు. విభీషణుడి ఇల్లు, సీత వున్న చోటు మినహా లంకావురి అంతా ఎర్రటి మంటల్లో కాలి బూడిదవుతోంది.

అది చూసి హనుమంతుడు విజయోత్సాహంతో సింహనాదాలు చేసి తిరుగు ప్రయాణం కట్టాడు. అవలీలగా మళ్ళీ సముద్రం దాటేశాడు. సుగ్రీవుడ్ని కలుసుకుని లంకలో జరిగిన కథంతా చెప్పాడు. వానర రాజు సంతోషించాడు. తరువాత అందరూ రాముడి దగ్గరకు వెళ్ళి “సీతమ్మ జాడ తెలిసింది. లంకను ముట్టడించాలి. నువ్వు రావణుని సంహరించాలి” అని తొందర పెట్టారు.

కోదండ రాముడు వానర వీరులను వెంట పెట్టుకుని బయలు దేరాడు. కాని మార్గమధ్యంలో సముద్రం అడ్డొచ్చింది. సముద్రుడ్ని దారి ఇమ్మన్నాడు రాముడు. వీల్లే దన్నాడతను. తాను చీలిపోతే ప్రపంచం తలకిందులవుతుందని చెప్పాడు. “జగత్కల్యాణం కోసం బయలుదేరావు నువ్వు. నిన్నెవరూ ఆపలేరు. నీ దగ్గర వున్న వానర వీరుల్లో నలుడనేవాడు గొప్పవాడు. గడ్డిపోచగాని, కొయ్యగాని, రాయిగాని అతను
నీటిలో వేస్తే అది తేలుతుంది. వంతెన కట్టమని ఆతన్ని నువ్వు ఆజ్ఞాపించు. నేను అండగా వుంటాను. నీ పని సులువవుతుంది” అని సలహా కూడా ఇచ్చాడు.

రాముడు ఆజ్ఞాపించాడు.

వారధి పని ప్రారంభమైంది.

ఇంతలో లంకా నగరం నుంచి రావణుని తమ్ముడు విభీషణుడు వచ్చి రాముడ్ని ఆశ్రయించాడు. రాముడు అతన్ని చేరదీశాడు ·

అందరూ వంతెన మీదగా వెళ్ళి లంక చేరుకున్నారు. విభీషణుడు నగర రహస్యాలన్నీ రాముడికి చెప్పాడు. రాక్షసులని ఎన్నెన్ని ఉపాయాలతో చంపవచ్చో వివరించాడు.

యుద్ధంలో రామ లక్ష్మణులు తమ పరాక్రమమంతా చూపారు. సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, అంగదుడు, జాంబవంతుడు, విభీషణుడు సాయం చేశారు. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధంలో మరణించారు. యోధాను యోధులైన రాక్షస వీరు లెందర్నో వానరులు తెగటార్చారు. చివరికి రాముడు రావణుడ్ని సంహరించాడు. లంకా రాజ్యానికి విభీషడ్ని రాజు చేశాడు.

అనింద్యుడు అనే వృద్ధ రాక్షసుడు అశోక వనం నుండి సీతాదేవిని తోడ్కొని వచ్చి దాశరథికి చూపుతూ “మహాత్మా! పరమ సాధ్వి అయిన నీ దేవిని పరిగ్రహించు” అని ప్రార్ధించాడు. అక్కర్లేదన్నాడు రాముడు. ధూళి దూసరితాంగి, జటాధారిణి, మలిన వస్త్రధారిణి అయిన జానకితో చాలా పరుషంగా మాట్లాడాడు.

“నా శక్తి చూపడానికి, నా శౌర్యం ప్రదర్శించడానికి, పరస్త్రీలను చెరబట్టిన వాళ్ళ బతుకు ఇలా కడతేరుతుందని చెప్పడానికి రావణునిమీద దండెత్తి వచ్చాను. నేను నీకోసం కాదు. కనుక నీ యిష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళిపోవచ్చు” అన్నాడు కఠినంగా.

సీత దుఃఖపడింది.

చితి పేర్చమని మరిదికి ఆజ్ఞ ఇచ్చింది. జ్వాలల మధ్యకు దూకింది. చప్పున మంటలు వేడిమిని కోల్పోయాయి. అగ్నిదేవుడు ఆమెను స్వయంగా తీసుకువచ్చి రాముడికి అప్పగించాడు.

“రామచంద్ర ప్రభూ! సీతమ్మ నిర్దోషి, నిష్కల్మష. ఏ పాపమూ ఎరుగదు. మహా పతివ్రత. నీ నామస్మరణతోనే ఇన్నాళ్ళూ బతికి వుంది. నువ్వు లేక ఆమె జీవించదు. సీతను స్వీకరించు” అని చెప్పాడు. భూజాత పావిత్య్రన్ని లోకమంతా గుర్తించాలన్న వుద్దేశ్యంతోనే నిందించాడు రాముడు. అగ్నిదేవుని మాటలు విని
అందరూ హర్షించగా సీతను స్వీకరించాడు.

పుష్పక విమానంలో సీతను, లక్ష్మణుడ్ని కూర్చోబెట్టుకుని అయోధ్యకు బయలు దేరాడు. వానరులు జయజయ ధ్వానాలు చేశారు. నగరమంతా రాముడికి ఎదురు వచ్చింది. నందిగ్రామం నుంచి అన్న పాదరక్షలు నెత్తిమీద వుంచుకుని భరతుడు వచ్చాడు.

తరువాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది.

ఆబాల గోపాలమూ ఆనందించారు.

“ఇదీ రామకథ! ధర్మజా! నీ వలె అడవుల్లో అష్టకష్టాలు పడిన రాకుమారుడు రాముడు పున్నాడు, అవమానాల పాలైన ద్రౌపదివంటి సాద్వి సీతమ్మ తల్లి వున్నది. రాకుమారులకు, రాగ ద్వేష రహితులకు కూడా కాలం ఎదురు తిరిగినపుడు కష్టాలు వస్తాయి సుమా!” అంటూ ముగించాడు మార్కండేయ మహర్షి.

రఘురాముని దివ్య చరితాన్ని ఆలకించిన పాండవుల మనస్థయిర్యం రెట్టింపయింది. పులకించిన కామ్యకవనం పూలజల్లు కురిసింది.

స్పందించండి