వెంటనే మునులు, “విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు” అని సూతుణ్ణి అడిగారు.
పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధంచేసి, అలసిపోయి, ఎక్కుపెట్టి ఉన్న వింటి మొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు. ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి, విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి, అతను నిద్రలో ఉండటం చూసి, ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడ్డారు. అప్పుడు శివుడు బ్రహ్మతో, “నువ్వు ఒక పురుగును తయారుచేసి, దానిచేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి. నారి తెగగానే వింటి మొన పైకి లేస్తుంది. వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది,” అన్నాడు. బ్రహ్మ పురుగును సృష్టించి, విష్ణువు వింటి నారిని కొరకమన్నాడు.
దానికా పురుగు, “మహాత్మా, ఎలా చేసేది ఈ పని? మహాపాపం కాదా? తల్లీ పిల్లలను విడదీయటమూ, భార్యాభర్తలకు ఎడబాటు చేయటమూ, నిద్రాభంగం కలిగించటమూ బ్రహ్మహత్యలాటి మహాపాపాలు. ఈ పని నన్నుచేయమన్నారా?” అని అడిగింది.
“నువ్వేమీ విచారించకు. యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం,” అని బ్రహ్మ పురుగుతో అన్నాడు.
పురుగు సంతోషించి వింటి నారిని కొరికింది. అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది. భూమి అదిరింది. వింటి కొన చప్పున పైకి తన్నటంతో విష్ణువు తల కాస్తా ఎగిరిపోయింది. అది చూసి దేవతలు దిమ్మరపోయి, ఏంచెయ్యాలో తెలీక, “నువ్వే సర్వేశ్వరుడివి గదా, అన్ని లోకాలనూ భరించేవాడివిగదా! నీగతి ఇలా అయిందేమిటి? ఏ రాక్షసులూ చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు? నువ్వు మాయకు కూడా అతీతుడివే. మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా?” అని విలపించారు.
దేవగురువైన బృహస్పతి వారితో, “ఇలా ఏడుస్తూ కూచుంటే ఏమవుతుంది? జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి,” అన్నాడు.
“దేవతలంతా చూస్తూండగానే విష్ణువు తల తెగి, ఎగిరిపోయిందిగదా! మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది? దైవబలం వల్లనే ఏమైనా జరగాలి,” అన్నాడు ఇంద్రుడు.
అప్పుడు బ్రహ్మ, “దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి. ఆవిడే సృష్టి స్థితి కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి,” అన్నాడు. దేవతలు ఆదిశక్తిని ప్రార్థనచేశారు. వారిని కరుణించి దేవి ప్రత్యక్షమయింది.
“తల్లీ, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది? అతని తల ఏమయింది?” అని దేవతలు దేవిని అడిగారు.
దేవి వారితో ఇలా చెప్పింది:
“కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు. అది చూసి లక్ష్మి కంగారుపడింది. విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు? తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా? తనకన్న అందగత్తెను ఎవతెనైనా చూశాడా? ఇలా అనుకుని లక్ష్మి సవతిపోరును తలచుకుని క్షణకాలం విలవిలలాడింది. తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది. ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది ఇలా ఉండగా, హయగ్రీవుడనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నాకోసం తపస్సు చేశాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఎవ్వరి చేతా తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనక మరేదన్నా వరం కోరుకోమన్నాను. అందుకు వాడు తాను హయగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగ వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. మూడు లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. కనక మీరు ఒక గుర్రం తల తెచ్చి, విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి. అలాచేస్తే విష్ణుహయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు.”.
ఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే, దేవతలు దేవశిల్పిని పిలిచి, గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతకమన్నారు. దేవశిల్పి అలాగే చేశాడు.
విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుణ్ణి చంపి, లోకాలకు ఆనందం చేకూర్చాడు.