తరవాత మునులు సూతుణ్ణి మధుకైటభులు కథ చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు వారికా వృత్తాంతం ఇలా చెప్పాడు:
పాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి, నీటిలో ఈతలు కొట్టుతూ, తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు. వారిలో కైటభుడు అనేవాడు మధువుతో, “మహాసముద్రానికీ, మనకూ ఏదో ఆధారం ఉండి ఉండాలి,” అన్నాడు. వాడు అలా అనగానే ఆకాశంనుంచి ఒక మాట వినిపించింది.
మధుకైటభులు ఆ మాట పట్టుకుని జపించసాగారు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. రాక్షసులు దాన్ని చూసి, అది శక్తి తేజస్సే అని నిశ్చయించి, తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి, వెయ్యేళ్లు తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చుకుని దేవి వారిని వరం కోరుకోమన్నది. వాళ్ళు స్వేచ్ఛా మరణం కోరారు. ఆమె వారు కోరిన వరం ఇచ్చింది.
తరవాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ, ఒకచోట బ్రహ్మను చూసి, తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు.
“మాతో యుద్ధంచెయ్యి, యుద్ధం చెయ్య లేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి, ఎక్కడికైనా వెళ్ళిపో,” అన్నారు వాళ్ళు బ్రహ్మతో.
బ్రహ్మ భయపడి, యోగసమాధిలో ఉన్న విష్ణువుతో, ‘మేలుకో, నాయనా! ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు. నన్ను కాపాడు, అని వేడుకున్నాడు.
ఈ మాటకు విష్ణువు యోగనిద్ర నుంచి లేవలేదు. అప్పుడు బ్రహ్మ ఆదిశక్తియైన యోగనిద్రనే ప్రార్థనచేశాడు:
“తల్లీ, ఈ రాక్షసులనుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా, నువ్వే నన్ను కాపాడు,” అన్నాడు బ్రహ్మ..
వెంటనే యోగనిద్ర విష్ణువును విడిచి వెళ్ళిపోయింది. విష్ణువు నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు.
బ్రహ్మ ప్రార్ధన ప్రకారం, యోగనిద్ర విడిచి వెళ్ళగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డంవచ్చి, “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులనీ, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడనీ విన్నాం. అలాటి విష్ణువును యోగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి, తేజస్సూ ఏమయ్యాయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం. నువ్వు శక్తి మాత్రమే అన్ని శక్తులకూ మూలకారణం అంటున్నావు. నిజం ఏదో మాకు తెలియటం లేదు, అన్నారు.
దానికి సూతుడిలా అన్నాడు:
“మునులారా, మీరడిగినదానికి సమాధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైన వారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక, విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవమనీ, మరికొందరు సూర్యుడనీ, మరికొందరు అగ్ని అనీ, ఇంకా కొందరు చంద్రుడనీ, ఇంద్రుడనీ, కొందరు ఏదో అనీ, మాయలోపడి, రకరకాలుగా అభిప్రాయపడతారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా, అన్ని ప్రమాణాలకూ అతీతమైన పరశక్తిమాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వాయువులో, అగ్నిలో కనబడుతూంటుంది.”
అలా శక్తిచేత మేల్కొల్పబడిన విష్ణువు బ్రహ్మను చూసి, “నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి?” అని అడిగాడు.
“ఇంకనేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవులనుంచి ఇద్దరు రాక్షసులు, మధుకైటభులనేవాళ్ళు పుట్టి, నన్ను చంపుతామంటూ యుద్ధానికి పిలిచారు.” అన్నాడు బ్రహ్మ,
“దీనికే భయపడతావా? నేను ఎంతలేసి రాక్షసులను చంపానుకాను?” అని విష్ణువు అంటున్నంతలోనే, ఆ రాక్షసులు వచ్చిపడి, బ్రహ్మతో, “పారిపోయివచ్చి, ఇక్కడ దాక్కున్నావా? మేం కనుక్కోలేమనే? నిన్ను ఇతను రక్షిస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక, ఇతన్ని తోడు చావమంటావా?” అని మీదికివచ్చారు.
విష్ణువు బ్రహ్మను తనవెనక్కు రమ్మని, రాక్షసులతో, “తెగ వదరుతున్నారు, మదమెక్కింది కాబోలు? తొందరపడకండి, ఇప్పుడే మీ మద మణుస్తాను,”అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు.
దేవి ఆకాశం నుంచి చూస్తూండగా విష్ణువూ, మధుడూ యుద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలిసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్లయుద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది.అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. రాక్షసులను ఎలా జయించాలి? దానికి ఉపాయం ఏమిటి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అనుకుంటుంటే రాక్షసులు అతనితో, “యుద్ధం చెయ్యటానికి శక్తి చాలకపోతే, మాకు దాసుణ్ణని దణ్ణం పెట్టు, లేకపోతే నిన్ను చంపి, తరవాత బ్రహ్మను చంపేస్తాం,” అన్నారు.
విష్ణువు సౌమ్యంగా వారితో, “అలసిపోయిన వారినీ, వెనక్కుతిరిగినవారినీ, భయపడిన వారినీ,యుద్ధంలో పడిపోయినవారినీ ఎదుర్కోవటం వీరధర్మంకాదు. అది అలా వుంచి, మీరు ఇద్దరున్నారు. నేనేమో ఒక్కణ్ణి! ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధంచేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకుమాత్రం యుద్ధ ధర్మం తెలియదా?” అన్నాడు.
“సరే, విశ్రమించు. ఈలోగా మేమూ విశ్రమిస్తాం,” అన్నారు రాక్షసులు.
అప్పుడు విష్ణువు దివ్యదృష్టితో, ఆ రాక్షసులు వరం పొందినవారని గ్రహించి, “ఈ దుర్మారులతో అనవసరంగా యుద్ధం చేస్తినే! వీరు పరాశక్తినుంచి స్వేచ్ఛా మరణం వరంగా సంపాదించారు. వీరిని ఎలా చంపటం?” అని ఆందోళన పడసాగాడు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు:
“తల్లీ, నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీదుమిక్కిలి వాళ్ళే. నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు.”
దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, “రాక్షసులమీద నా మాయ కప్పుతాను. వారిని జయించు,” అన్నది.
రాక్షసులు విష్ణువుతో, “ఓడిపోతానని ఎందుకు భయపడతావు? శూరులకు జయాపజయాలు రెండూ సంప్రాప్తమవుతాయి. నీచేత ఎందరు రాక్షసులు ఓడారుకారు? అయినా ఎప్పుడూ జయమే కలుగుతుందా?” అని ఎత్తి పొడిచారు.
ఈ మాటకు విష్ణువు మండిపడి, రాక్షసులతో తలపడి, వాళ్ళను పిడికిలితో పొడిచాడు. వాళ్ళు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టియుద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి, రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు.
అదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మథుడి బాణాలలాటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు యుద్ధంమాట మరచి మోహ పాశానికి చిక్కుపడ్డారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, “ఎంతమంది రాక్షసులనైనా చూశానుగానీ, యుద్ధవిద్యలో మీతో సమానులను చూడలేదు. మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమయింది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను,” అన్నాడు.
దేవీ ప్రభావంచేత మాయామోహితులై ఉన్న రాక్షసులు, విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని, విష్ణువును తూస్కారంగా చూస్తూ, “మేం నిన్ను అడిగేవాళ్ళమూ, నువ్వు మాకు ఇచ్చేవాడివీనా? కావాలంటే నువ్వే కోరు, మేం ఇస్తాం!” అన్నారు.
“నేను కోరినది ఇస్తారా? అదే నిజమైన వీరుల గుణం. చాలా సంతోషం! నా యుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నాచేత ఇప్పుడే చచ్చిపొండి, మరి ఇచ్చినమాట నిలుపుకోండి! “అన్నాడు విష్ణువు.
రాక్షసులు కళవళపడి, కొంచెం ఆలోచించి, “నువ్వు మాటమీద నిలబడే వాడివైతే, మాకు వరం ఇస్తానన్నమాట గుర్తుంచుకుని, నీరులేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చిపోతాం,” అన్నారు.
విష్ణువు నవ్వి, తన తొడలు పెంచి, “రాక్షసులారా రండి,” అన్నాడు.
రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలనూ, రాక్షసులు తమ శరీరాలనూ ఇలా పెంచగా, చిట్టచవరకు రాక్షసుల శరీరాలకన్న విష్ణువు తొడలే పెద్దవి అయ్యాయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ళ మెదడు, నీటిలోపడి, పెద్దమిట్ట తయారయింది. అది మొదలు భూమికి మేదిని’ అనే పేరువచ్చింది.