శుకుడి జననం

ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు, “ప్రసంగవశాన ఇతర విషయాలు చాలా విన్నాం. కాని కొడుకుకోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది,” అన్నారు. మునులతో సూతుడు, వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు:

నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరిమీద, కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తూంటే, భూమ్యాకాశాలు కంపించాయి. ఇంద్రుడు భయపడి, దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి, “వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. గొప్ప ప్రమాదం వచ్చిపడింది. మమ్మల్ని కాపాడు!” అని ప్రార్థించాడు.

“తపస్సుచేసుకునేవారికి కీడు తలపెట్టరాదు. వాళ్ళు ఇతరులకు చెరుపు చెయ్యరు. వ్యాసుడు కొడుకును కోరి, శక్తితోకూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు,” అని శివుడు దేవతలతో చెప్పి, వ్యాసుడి ముందు ప్రత్యక్షమై, అతని కోరిక తీరేలాగు వరమిచ్చాడు. వ్యాసుడు, తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

అతను అరణి మధించి అగ్నిచేసి, “ఇలాటి అగ్నివంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతి బంధకం,” అని అనుకుంటుండగా, ఆకాశంలో ఘృతాచి కనబడింది. సమీపంలోనే మన్మథుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మథుడి ప్రభావానికి గురి అయికూడా, “ఇది నన్ను మోసగించటానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో? లేక, పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా?” అనుకున్నాడు.

పురూరవుడి లాగే తానూ బాధపడవలసి వస్తుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచికూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని, ఆడ చిలుకగామారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు అగ్నికోసం మధించుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు.

వ్యాసుడు శుకుణ్ణి చూసి, “ఏమిటీ అద్భుతం! ఇది శివుడి మహిమ కావాలి,” అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి, స్నానంచేయించి, జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందుభులు మోగాయి. భూమిమీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైనవారు పాడారు. రంభమొదలైన అప్సరసలు ఆడారు.

చిలుకరూపం ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కు శుకుడు అనే పేరువచ్చింది. కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. శుకుడికోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండమూ, కమండలమూ పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపనయనం చేసి, బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు.

శుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి, తండ్రివద్దకు తిరిగి వచ్చాడు.

“చదువు పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడు ఎంతో సంతోషించి, అతనికి వివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుకుడుఅందుకు అంగీకరించక, వైరాగ్యం పూనితత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు.

“మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం. అంతేకాని మరేవీ ముక్తికి బంధాలుకావు. న్యాయంగా ధనం సంపాయిస్తూ, అబద్ధమాడక, శౌచం విడవక, అతిథులను ఆదరిస్తూ, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ, గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వసిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు; నువ్వుకూడా ఒక కన్యను పెళ్ళాడి, నాకు సంతోషం కలిగించి పితృ దేవలకు తృప్తినివ్వు,” అన్నాడు వ్యాసుడు.

ఇంతచెప్పినా శుకుడి బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు మళ్ళీ, “నాయనా ఒకప్పుడు నేను ముక్తినివ్వగల దేవీభాగవతం రచించాను. దాన్ని చదివి జ్ఞానివికమ్ము, “అని దానిని గురించి చెప్పడం ప్రారంభించాడు.

వైరాగ్య చిత్తంతో వివాహంచేసుకోనని పట్టుబట్టిన శుకుడికి, వ్యాసుడు తాను రచించిన దేవీ భాగవతం చెప్పాడు:

విష్ణువు మర్రి ఆకు మీద పిల్లవాడుగా ఉండి, “నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను? నన్ను ఎవరు సృష్టించారు? ఈ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి?” అని విచారిస్తూంటే, అతన్నిచూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకంచెప్పి, “ఇదే సమస్త మూనూ. దీన్ని తెలుసుకుంటే నన్నెరిగినట్టే,” అన్నది.

విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడుగానీ, అర్థం చేసుకోలేకపోయాడు.

అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు. అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదాదులు ధరించి, మేలిమి బంగారు బట్టలు కట్టి, తనలాటివారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదట ప్రత్యక్షమయింది.

విష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపోయాడు. అప్పుడామె అతనితో, “మాయ మూలంగా నన్ను మరిచావు. ఇప్పుడు నువ్వు సగుణుడివి. నేను సత్త్వశక్తిని, నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి, రజోగుణంగలవాడై అన్ని లోకాలూ సృష్టి చేస్తాడు. అతను చేసిన సృష్టికి నువ్వు పాలకుడవుగా ఉంటావు. ఆ బ్రహ్మదేవుడి కనుబొమ్మల మధ్య నుంచి, క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు. ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి, దాని మూలంగా తామసగుణం కలిగినవాడై, ప్రళయకాలంలో, బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. నువ్వు నా సహాయంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనక సత్త్వశక్తినైన నన్ను గ్రహించు. నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను,” అన్నది.

ఆమెతో విష్ణువు, “నాకు ఒక అర శ్లోకం వినబడింది. దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు అన్నాడు.

“నన్ను సగుణగా నువ్వు చూస్తున్నావు. నీకా అరశ్లోకం చెప్పినది నిర్గుణస్వరూపి అయిన పరదేవత. ఇది భాగవతమనే పేరుగల మంత్రం. దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి,” అన్నదామె.

విష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైటభులను చంపి, వారికి భయపడి తనకు శరణుజొచ్చిన బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికీ, నారదుడు వ్యాసుడికీ ఉపదేశించారు. వ్యాసుడు మహిమాన్వితమైన ఆ మంత్రాన్ని శుకుడికి ఉపదేశించి, “దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరించి రచించాను,” అన్నాడు.

స్పందించండి