శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించమన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు:
కోసలదేశపు రాజధాని అయోధ్యా నగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు సుదర్శనుడనీ, లీలావతికి శత్రుజిత్తు అనీ కొడుకులు కలిగారు.
ధ్రువసంధి ఒకనాడు వేటాడుతూండగా సింహం ఒకటి అతని మీద పడింది. సింహము, ధ్రువసంధీ హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరూ చనిపోయారు.
మనోరమ తండ్రి కళింగదేశపు రాజు వీరసేనుడు, తన అల్లుడు చనిపోయిన వార్తవిని మనమడైన సుదర్శనుడి క్షేమం చూడడానికి వచ్చాడు. అలాగే ఉజ్జయిని నుంచి శత్రుజిత్తు మాతామహుడైన యుధాజిత్తు కూడా వచ్చాడు.
సుదర్శనుడు, శత్రుజిత్తు ఇరువురిలో ఎవరిని రాజు చేయడమా అన్న విషయంలో ఇద్దరు మాతామహుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఘర్షణపడ్డారు. ఆ పోరాటంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి చంపేశాడు.
మనోరమ బిడ్డగావున్న సుదర్శనుణ్ణి వెంటబెట్టుకుని భరద్వాజాశ్రమం చేరింది. భరధ్వాజుడు ఆమెనూ, బిడ్డనూ ఆదరించి, శత్రువుల బారి నుంచి కాపాడి, సుదర్శనుడికి విద్యాబుద్ధులు నేర్పాడు. యుక్తవయస్కుడైన సుదర్శనుడికి ఒకరోజు మహాదేవి కలలో కనిపించి అస్త్రవిద్య ప్రసాదించింది.
కాశీరాజు సుబాహుడి కూతురు శశికళ, అద్భుత సౌందర్యవతి అని విని, సుదర్శనుడు ఆమెను పెళ్ళాడ గోరాడు. అదేవిధంగా శశికళ కూడా సుదర్శనుణ్ణి పెళ్ళాడ నిశ్చయించింది.
సుబాహుడు తన కుమార్తె శశికళ స్వయంవరం ప్రకటించాడు. నానాదేశాల రాజులూ కాశీకి వచ్చారు. అయితే శశికళ సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టుపట్టింది!
రాణి తన కుమార్తె వద్దకు వెళ్ళి, “అమ్మా, నిన్ను పెళ్ళాడాలని అంతమంది రాజులు వచ్చి ఉండగా సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టు బట్టి, మన ప్రాణాలమీదికి ఎందుకు తెస్తావు? స్వయంవర సభకు పద. నువ్వు సుదర్శనుణ్ణి వరిస్తానంటే, యుధాజిత్తు ఆ సుదర్శనుడితో పాటూ నిన్నూ, నన్నూ, నీ తండ్రినీకూడా చంపేస్తాడు!” అని హెచ్చరించింది.
ఎన్ని చెప్పినా, శశికళ మరొకరిని పెళ్ళాడనన్నది. ఆమె తండ్రితో, “నీకు ఈ రాజులంటే భయం అయితే నన్ను సుదర్శనుడి కిచ్చి, రథంలో మమ్మల్ని పొలిమేర దాటించు. యుద్ధం జరిగితే అతను శత్రువులను తానే చంపేస్తాడు,”అన్నది.
“చూడు తల్లీ! అనేకమందితో విరోధం తెచ్చుకోవటం ఎవరి తరమూ కాదు. మిమ్మల్ని పొలిమేర బయట వదిలినంత మాత్రాన ఆ దుర్మార్గులు మిమ్మల్ని చుట్టుముట్టితే మీరు చెయ్యగలిగినదేమున్నది? నాకొక పద్ధతితోస్తున్నది. సీత పెళ్ళికి పెట్టినట్టుగా నీ పెళ్ళికి ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గినవాణ్ణి పెళ్ళాడు,” అన్నాడు సుబాహుడు.
“అందువల్ల సమస్య తీరుతుందా? పందెంలో ఎవడో గెలిచి నన్ను పెళ్ళాడతాడు. అప్పుడు మిగిలినవాళ్ళు ఊరుకుంటారా? ఎలాగూ యుద్ధం తప్పదు. మహాదేవిని నమ్ముకుని నన్ను సుదర్శనుడికిచ్చి పెళ్ళిచెయ్యి,” అన్నది శశికళ.
ఆమె నిర్ణయించిన పథకాన్ని ఆమోదించాడు సుబాహుడు.
సుబాహుడు రహస్యంగా వివాహ ప్రయత్నాలు జరిపించి, సుదర్శనుణ్ణి రప్పించి, తన కూతుర్ని అతనికి శాస్త్రోక్తంగా కన్యాదానం చేశాడు. ఆ సందర్భంలో ఆయన తన అల్లుడికి రెండు వందల రథాలూ, కొన్ని వేల గుర్రాలూ, కొన్ని వందల మంది దాసీలూ, ఇతర కానుకలూ ఇచ్చాడు. అతను మనోరమతో, “అమ్మా, ఇక నా కూతురు నీ కొడుకు సొత్తు, నీసొత్తు. దాన్ని ప్రేమగా చూసుకో,” అని నమస్కారం చేశాడు.
మనోరమ ఎంతో సంతోషంతో, “అయ్యా, మహారాజువై ఉండి కూడా రాజ్యహీనుడైన నా కొడుక్కు నీ కూతుర్ని పెళ్ళిచేశావు! నీవంటి ఉత్తముడు ముల్లోకాలలో ఎక్కడా ఉండడు. నీ కుమార్తె భారం మాది అయితే, మా భారం నీది!” అన్నది.
దానికి సుబాహుడు, “అమ్మా, నీ కొడుకు రాజ్యవిహీనుడని ఎందుకు అనుకోవాలి? నా రాజ్యం అతనిది కాదా? నా సేన అంతా ఇస్తాను. మనం నీరక్షీర న్యాయంగా ఉండేటప్పుడు ఒకడు రాజనీ, ఇంకొకడు సేవకుడనీ విచక్షణ అండ ఉండగా విచారం దేనికి?” అన్నాడు.
“ఎంత చల్లనిమాట అన్నావు, బాబూ! నీకు శుభం కలుగుతుంది. నీ రాజ్యాన్ని నువ్వూ, నీ కొడుకులూ సుఖంగా ఏలుకోండి. జగన్మాత అనుగ్రహంతో నా కొడుకు తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. గ్రహచారం సరిగా ఉన్నవాడు మట్టి పట్టుకుంటే, బంగారమవుతుంది. ఏది చేసినా కలిసివస్తుంది. అందరూ సహాయపడతారు. ఇప్పుడు నా కొడుకు రోజులు మంచివి. కీడు రాదు, అన్నది మనోరమ.
సుబాహుడు పెళ్ళితంతు పూర్తిచేసి, తన కూతురికి, అల్లుడికి అప్పగింతలూ, అంపకాలూ జరుపుతూండగా, కొందరు వచ్చి, “రాజా, వధూవరులను ఇప్పుడు పంపకండి. దారిలో శత్రువులు రాక్షసులలాగా కాపువేసి ఉన్నారు, అని చెప్పారు.
రాజుల సంగతి ఎరిగినవాడు కావటంచేత సుబాహుడు ఆ మాట నమ్మి, అంపకాలు చెయ్యటానికి సంశయించాడు.
అప్పుడు సుదర్శనుడు అతనితో, “రాజా, నువ్వేమీ సంకోచించవద్దు, దేవి నా పక్షాన ఉండగా ఈ రాజులు నన్నేం చెయ్యగలరు?” అన్నాడు.
కాశీరాజు తన అల్లుడికి అంతులేని ధనం ఇచ్చి సాగనంపుతూ, సైన్యంతో సహా తాను కూడా తోడు బయలుదేరాడు.
దారులు కాచివున్న రాజులు దూరం నుంచి చూసి, “అదుగో రథం! వాడే సుదర్శనుడు! పెళ్ళాంతో సహాపోతున్నాడు. పట్టుకుని కొడదాం పట్టండి! అంటూ విజృంభించారు.
సుబాహుడు వారికి అడ్డుపడ్డాడు. సుదర్శనుడు మంత్రం జపిస్తూ, అంబను ధ్యానించాడు. ఆ సమయంలో శత్రుజిత్తూ, యుధాజిత్తూ అతనిపైకి వచ్చారు. సుబాహుడు వీరావేశంతో శంఖం పూరించి, యుధాజిత్తు మీద వరసగా బాణాలు వేశాడు. ఇద్దరికీ తీవ్రంగా యుద్ధం సాగింది.
అంతలో జగదంబ దివ్యమైన ఆకారంతో, అనేక మహాయుధాలతో, పూలమాలలతో, సింహంమీద ప్రత్యక్షమయింది. సుదర్శనుడు ఆనందంతో శరీరం పులకరిస్తూండగా దేవిని తన మామకు చూపి, “ఇంకమనకు భయమేమిటి?” అని చెప్పి, రథం దిగి, తన భార్యనూ, మామనూ వెంటబెట్టుకుని దేవి కాళ్ళకు ప్రణామం చేశాడు.
ఏనుగులు సింహాన్ని చూసి భయపడి ఘీంకారాలు చేస్తే, సింహం వాటిని చూసి గర్జించింది. అదే సమయంలో దారుణంగా గాలి వీచి బీభత్సం చెలరేగింది. రాజులందరికీ కంపరం పుట్టింది. వాళ్ళు దిక్కు తెలియనట్టుగా నిశ్చేష్టులై చూడసాగారు.
అప్పుడు సుదర్శనుడు సేనాపతితో, “మహాదేవి మనకు అండగా వచ్చింది. నువ్వు సంశయించక, రాజుల మీదికి సేనలు నడిపించు,” అన్నాడు.
కాశీరాజు సేనలు రాజులపైకి విజృంభించాయి.
అప్పుడు, తెల్లబోయి చూస్తున్న రాజులతో యుధాజిత్తు, “ఎవరో ఆడది సింహంమీద వచ్చేసరికి మీకు మతులుపోయాయేమిటి? ఒక అర్భకుడు ఒక ఆడదాన్ని తోడు తెచ్చుకుంటే ఇందరు రాజులూ కొయ్యబారిపోతారా? క్షణంలో వాణ్ణి చంపి, రాజు కూతుర్ని వశపరుచుకుందాం, పట్టండి!” అని, తన మనమడైన శత్రుజిత్తును వెంటబెట్టుకుని, సుదర్శనుడి మీద యుద్ధం సాగించాడు.
అప్పుడు అంబ అందరి రాజులకూ అన్ని రూపాలలో కనబడి, అందరితోనూ ఒక్కసారే యుద్ధం చేసింది. క్షణంలో యుధాజిత్తూ శత్రుజిత్తు బాణాలు తగిలి చచ్చారు. సుబాహుడు ఆనందబాష్పాలు రాల్చుతూ, ఆ పరాశక్తిని స్తోత్రం చేశాడు. తరవాత అతను ఆమెతో, “తల్లీ, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపో! ఈ కాశిలోనే ఉండిపో. నాకు మరెవరి అండా అవసరంలేదు. భూమి ఉన్నంత కాలమూ ఈ కాశీ ఉంటుందంటారు. కాశీ ఉన్నంత కాలమూ నువ్వు ఇక్కడే ఉండి, మాకు శత్రుభయం లేకుండా చెయ్యి. ఇదే నేను నిన్ను కోరే వరం,” అన్నాడు.
మహాదేవి అందుకు ఒప్పుకున్నది.
తరువాత సుదర్శనుడు మహాదేవిని స్తోత్రంచేశాడు. అతను ఆమెను, “తల్లీ, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేనెక్కడికి పోవాలి? నేను స్వయంగా అసమర్థుడనైనప్పటికీ, నీ అండ ఉంటే ఏమైనా సాధించగలను. అందుచేత నా కర్తవ్యం తెలిపి, నన్ను అనుగ్రహించు,” అని వేడుకున్నాడు.
దానికి దేవి, “ఇంక చేసేదేమున్నది? నీ భార్యతో సహా అయోధ్యకు వెళ్ళి, సింహాసనం ఎక్కు; తగిన విధంగా రాజ్యం చేసుకో. నిన్ను నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను. ప్రతి అష్టమి, నవమి, చతుర్దశికీ నన్ను పూజ చెయ్యి. నాకు శరత్కాలం ఇష్టం. నవరాత్రి పూజలు చెయ్యి. మాఘ, చైత్ర, ఆశ్వయుజ, ఆషాఢ మాసాలు నాకు ఉత్సవాలు జరిపించు,” అని హెచ్చరించి అదృశ్యమయింది.
తరవాత రాజులు ఒక్కరొక్కరే వచ్చి, ఇంద్రుడికి దేవతలు మొక్కిన విధంగా సుదర్శనుడికి మొక్కి, అంబను స్తుతించారు. వాళ్ళు అతన్ని తమ చక్రవర్తిగా ఆమోదించారు.
సుదర్శనుడు అయోధ్యకు చేరే లోపునే వార్తలు చేరాయి. అందుచేత మంత్రులు మంగళవాద్యాలతో సహా ఎదురువచ్చి, సుదర్శనుణ్ణి, అతని భార్యనూ నగరంలోకి తీసుకుపోయారు.
సుదర్శనుడు తన సవతి తల్లి వద్దకు పోయి, కొడుకు చచ్చి ఏడుస్తున్న లీలావతికి నమస్కరించి ఓదార్చి, “అమ్మా, నీ తండ్రినీ, నీ కొడుకును చంపినది నేనుకాదు, మహాశక్తి! నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. ఎవరో చేసిన కర్మకు నువ్వెందుకు బాధపడాలి? నన్ను నీ కొడుకులాగే చూసుకో. నీకు ఎల్లప్పుడూ మాతృసేవలు చేస్తాను. నేను పసివాణ్ణి అయి ఉండగా నీ తండ్రి దురుద్దేశంతో నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే, అది నా ప్రారబ్ధం అనుకున్నాగాని, దుఃఖించలేదు. నీ తండ్రి నా తాతను చంపేస్తే, నా తల్లి పుట్టెడు దుఃఖంతో నన్ను తీసుకుని అడవిదారిన పోతుంటే, మమ్మల్ని దొంగలు దోచారు. తరువాత గంగాతీరాన ఋష్యాశ్రమంలో తలదాచుకున్నాం. వాళ్ళ అనుగ్రహంవల్ల ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఇప్పటికీ కూడా నాకు ఎవరిమీదా ద్వేషం లేదు,” అన్నాడు.
అతని మాటలు విని లీలావతి సిగ్గుపడుతూ, “నేను వద్దంటున్నా వినకుండా నా తండ్రి నీకు ద్రోహంచేసి, తాను చావటమేగాక, నా కొడుకునుకూడా చంపాడు. నీ తల్లి నా అక్క, నువ్వు నా కొడుకువు! నేను విచారించవలసిన పనేమిటి? నా వాళ్ళు చావటానికి కారణం నువ్వు కాదని నాకు తెలియదా?” అన్నది.
తరువాత సుదర్శనుడు తన మంత్రులచేత ఒక బంగారు సింహాసనం తయారు చేయించి, దాని మీద జగదంబను యథావిధిగా స్థాపించి, రోజూ పూజిస్తూ, పట్టాభిషేకం చేసుకుని, సుఖంగా చాలాకాలం రాజ్యం చేశాడు.