మహిషాసుర వధ

దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేశారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు.

ఇంద్రుడు మొసలి రూపంలో పంచ నదంలో ప్రవేశించి, కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు.

అప్పుడు అగ్ని ప్రత్యక్షమై, “ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా, పరమా? నీ తపస్సు చూసి నేను సంతోషించాను. కోరుకో, వరం ఇస్తాను.” అన్నాడు.

“దేవా, నీకు నామీద అనుగ్రహం ఉంటే నాకు అజేయుడైన ఒక కొడుకును ఇయ్యి! వాడు కామరూపి, దేవతలకుగానీ, దానవులకుగానీ, జయించరానివాడుగా ఉండాలి,” అన్నాడు రంభుడు.

“అలాగే అవుతుంది,” అని అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడు.

రంభుడు తిరిగి వస్తూ, యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు. ఆ మహిషి అతని వెంట పాతాళానికి వచ్చేసింది.

అక్కడ ఆ మహిషిని మరొక మహిషం వెంబడించింది. అదిచూసి రంభుడు ఆగ్రహావేశంతో దాన్ని కొట్టాడు. ఆ మహిషం(దున్నపోతు) రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి, చంపేసింది. అది చూసి మహిషి రంభుడితో పాటు చితిమంటలలో కాలి పోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు. ఒకడు మహిషుడు, ఇంకొకడు రక్తబీజుడు.

రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు. మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సుచేసి, బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, “మహాత్మా, నాకు చావు లేకుండా చెయ్యి,” అని వరం కోరాడు.

దానికి బ్రహ్మ, “పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు, చచ్చినవాళ్ళు పుట్టకా తప్పదు. చావకుండా నీకు వరం ఎలా ఇయ్యగలను? భూమికీ, సముద్రానికీ, కొండలకు సైతం నాశనం ఉన్నది గదా! చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరంకోరుకో, అలాగే ఇస్తాను,” అన్నాడు.

అప్పుడు మహిషుడు, “ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనక, దేవతలలోగాని, దానవులలోగాని, మానవులలోగాని ఏ పురుషుడి చేతా నాకు చావు లేకుండా అనుగ్రహించు,” అని బ్రహ్మను కోరాడు.

“అలాగే, కాని నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది,” అని బ్రహ్మ వెళ్ళిపోయాడు.

ఈ వరంపొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఒక సేవకుణ్ణి పిలిచి, హెచ్చరించి రమ్మని పంపాడు. వాడు వెళ్ళి ఆమాట ఇంద్రుడికి చెప్పాడు.

ఇంద్రుడు ఆవేశంతో దిక్పాలకులను సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు:

“రంభుడికొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధంచేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడు స్వర్గాన్ని జయిస్తాడట. మహిషుడికి సేవకుడివిగా ఉంటావో, యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడిదూత వచ్చి చెప్పి పోయాడు. అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చండి. శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు. జయాపజాయాలు దైవాధీనమే అయినా ప్రయత్నం మానరాదు. సంధి చేయటం మంచిదే. కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది. యుద్ధం చెయ్యాలన్నా మన బలాలూ, శత్రుబలాలూ సరిగా అంచనా వెయ్యవలసి ఉంటుంది. అందుకు ఒక మనిషిని పంపుదాం.”

ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి, మహిషుడి బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది, తన పురోహితుడైన బృహస్పతిని, “మహిషుడు అంతులేని సేనలతో మనమీదికి యుద్ధానికి వస్తున్నాడు. ఏమిటి ఉపాయం?” అని అడిగాడు.

ఇంద్రుడి కంగారు చూసి బృహస్పతి, “అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచి పెట్టరాదు. ధైర్యంగా ఉండు. అయ్యేది కాకుండా ఉండదు. అయినా శాయశక్తులా ప్రయత్నం చెయ్యవలసిందే! అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు? అచ్చగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు. మనం ప్రయత్నంచేసినా ఫలితం కలగకపోతే అది దైవికం,” అన్నాడు.

దానికి ఇంద్రుడు, “దేవా, ప్రయత్నించక పని జరగదు. యతులకు విజ్ఞానమూ, బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగు. నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే, నేను యుద్ధ యత్నం చేస్తాను. నాకు నువ్వూ, వజ్రాయుధమూ, హరి హరులూ సహాయులు,” అన్నాడు.

బృహస్పతి ఇంద్రుడితో, “నేను నిన్ను యుద్ధం చెయ్యమనిగానీ, వద్దనిగానీ సలహా చెప్పను. మీమీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి,” అన్నాడు.

అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు జొచ్చి, “మహిషుడు అనేవాడు మదించి స్వర్గంమీదికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు. వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతున్నది. నా దురవస్థ చూడు!” అన్నాడు.

ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ, “మనం శివుణ్ణి, విష్ణువునూ వెంటబెట్టుకుని యుద్ధం చెయ్యటం మంచిది. ముందు కైలాసానికి పోదాం,” అన్నాడు.

ఇద్దరూ కలిసి శివుడివద్దకు వెళ్ళి సంగతి చెప్పారు. తరువాత ముగ్గురూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. అందరూ కలిసి మహిషుడితో యుద్ధం చెయ్యటానికి నిర్ణయం జరిగింది. హంసమీద బ్రహ్మా, గరుత్మంతుడి పైన విష్ణువూ, ఎద్దుమీద శివుడూ, నెమలిమీద కుమార స్వామీ, ఏనుగు మీద ఇంద్రుడూ ఎక్కి యుద్దానికి బయలుదేరారు. దేవసేనలూ, రాక్షససేనలూ ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి.

యుద్ధం భయంకరంగా సాగింది. ఎంత శౌర్యపరాక్రమాలు ప్రదర్శించినా దిక్పాలకులూ, ఇంద్రుడూ, త్రిమూర్తులూ మహిషుడి ధాటికి తట్టుకోలేక చివరకు పారిపోయారు. స్వర్గం మహిషుడి వశమయింది. మహిషుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని, పదవులన్నిటా తన రాక్షసులను నిలిపి, దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకుని, స్వర్గసుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు. దేవతలు కొండలూ, గుట్టలూ పట్టి పోయి, అష్టకష్టాలూ పడ్డారు.

ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి, “ఒక్క మహిషానురుడు మమ్మల్నందరినీ జయించి, మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడు, తండ్రివంటి వాడివి, మా దుస్థితి ఎందుకు చూడవు? సర్వజ్ఞుడివి, మా గతి ఏమిటి?” అని వాపోయారు.

“నన్నేం చెయ్యమంటారు? వాడు తనను ఏ పురుషుడూ చంపకుండా వరం పొందాడు. వాణ్ణి చంపితే ఆడదే చంపాలి. మనం ముందు శివుడితోనూ, తరువాత విష్ణువుతోనూ ఆలోచిద్దాం,” అన్నాడు బ్రహ్మ.

దేవతలందరూ బ్రహ్మవెంట శివుడి వద్దకు వెళ్ళారు.

“ఏం పనిమీద వచ్చారు?” అని శివుడు వారిని అడిగాడు.

“నీకు తెలియనిదేమున్నది? మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి, దేవతలనూ అష్టకష్టాలపాలు చేశాడు. వాళ్ళు తమ గతి ఏమిటని అడుగుతున్నారు,” అన్నాడు బ్రహ్మ.

శివుడు చిరునవ్వు నవ్వి, “దేవతలకు ఈ అనర్థం కలిగించినది నువ్వేకదా! నీ వరంవల్ల వాణ్ణి ఏ మగవాడూ చంపలేడు, మరి వాణ్ణి చంపటానికి ఏ ఆడదాన్ని పంపుదాం? నీ భార్యను పంపుతావా? నా భార్యను పంపనా? లేక ఇంద్రుడి భార్య పోతుందా? మన భార్యలలో ఒకతె కూడా యుద్ధం చెయ్యగలది కాదే! అందుచేత ఏంచేస్తే బాగుంటుందో విష్ణువును అడుగుదాం. అతను నాకన్న తెలివిగలవాడు,” అన్నాడు.

అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు, “మనమందరమూ మహిషుడితో యుద్ధంచేసి ఓడిన వాళ్ళమే గదా! వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి, ఆమెకు మన ఆయుధాలిచ్చి, ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి,” అన్నాడు.

విష్ణువు ఇలా అంటూండగానే దేవతలందరి నుంచీ రకరకాల తేజస్సు వెలువడి, అది క్రమంగా ఏకమై, పద్ధెనిమిది చేతులు గల స్త్రీ మూర్తిగా తయారయింది. దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలు ఉంచారు. ఆమె దేవతలతో, “భయపడకండి. ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను!” అంటూ సింహనాదం చేసింది.

దాన్ని విని మహిషుడు, “ఎవడు ఈ ధ్వని చేసినది? వెళ్ళి, వాణ్ణి పట్టి తీసుకురండి! నా చేత చావు దెబ్బతిన్న దేవతలకు ఇంత సాహసం ఉండదే!” అన్నాడు తన వాళ్ళతో.

వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి, మహిషుడితో, “ఎవరో సింహం ఎక్కి వచ్చింది. ఒంటినిండా ఆభరణాలు, పద్ధెనిమిది చేతులలో ఆయుధాలు!” అని చెప్పారు. మహిషుడు తన మంత్రితో, “ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా! నా పట్టమహిషిగా చేసుకుంటాను!” అన్నాడు.

మంత్రి వచ్చి, దూరంగా నిలబడి దేవితో, “అమ్మా, నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సర్వలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను పెళ్ళాడ కోరుతున్నాడు,” అన్నాడు.

దేవి చిన్నగా నవ్వి, “వాణ్ణి చంపటానికే వచ్చాను. నువ్వు మంచివాడివిలాగున్నావు. నిన్ను చంపను. మీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు!” అన్నది.

మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక, రాయబారానికి తన సేనాపతిని తామ్రుణ్ణి పంపాడు. దేవి వాణ్ణి చంపింది. అంతటితో మహిషుడి ప్రేమఘట్టం అంతమయింది. అతను దేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు. అందరూ దేవిచేత చచ్చారు. తరవాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. మహిషుడు కామరూపి కావటంచేత, అనేక రూపాలు ధరించి దారుణ యుద్ధం చేశాడు. చివరకు దేవి వాణ్ణి చక్రాయుధంతో తల నరికి చంపేసింది. దేవతలు పరమ సంతోషం పొంది, దేవిని స్తోత్రం చేశారు.

స్పందించండి