అమూల్యమైన వస్తువు

ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలుపెట్టి, వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి, రాజకుమారులను దేశబ్రష్టులను చేసి తానే రాజు అయ్యాడు.

ముగ్గురు రాజకుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు.

ఇంతలో దేవుడు, “ప్రపంచంలోకల్లా విలువైనది సంపద, అది ఉంటే ఇంక దేన్నైనా సాధించవచ్చు” అన్నాడు.

“కాదు, సైనికబలం. అది ఉండబట్టే మన సేనాని మనని దేశబ్రష్టులను చేశాడు” అన్నాడు శంఖుడు.

“కానే కాదు, వాడు సైనికులను డబ్బుతో కొన్నాడు. అంచేత డబ్బే ప్రధానం” అన్నాడు దేవుడు.

ఇలా వాదులాడుతూ “మనం ముగ్గురం మూడు దిక్కులకు వెళ్ళి, మనకు అమూల్యమైనవి తోచిన వాటిని సంపాదించి తిరిగి పదేళ్లకు ఇక్కడే కలుద్దాం!” అన్నాడు శంఖుడు. మర్నాడు దేవుడు తూర్పుగా, శంఖుడు పడమరగా బయలుదేరాడు. ఉత్తరంగా బయలుదేరిన అమందుడు కొద్దిసేపటికి వెనక్కి తిరిగి వచ్చి, పెదరాసి పెద్దమ్మ కూతుర్ని పెళ్లాడి అక్కడే సుఖ సంతోషాలతో అక్కడే ఉండిపోయాడు.

పదేళ్లు గడిచాయి, దేవుడు తూర్పు నుండి అంతులేని బంగారం తీసుకొని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు. పడమటి నుండి శంఖుడు పెద్ద సైన్యంతో వచ్చాడు.

“చూశావా? నా బంగారంతో నీ సేననంతా కొనగలను” అన్నాడు దేవుడు. “అసంభవం, నేను శంఖం పూరించానంటే నా సైనికులు నీ బిడారుని క్షణంలో రూపు మాపేస్తారు” అన్నాడు శంఖుడు. ఇంతలో ఇంట్లో ముందు అమందుడు బయటికి వచ్చాడు.

అమందుడుని చూసి “నీవు సంపాదించిన అమూల్య వస్తువేంటి?” అని అడిగారు అన్నలిద్దరూ. “సంతృప్తి!” అని సమాధానం ఇచ్చాడు అమందుడు.

స్పందించండి