అన్నదమ్ములు

అనగా అనగా వొకవూళ్లో రామయ్య, సోమయ్య అని యిద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు; తెలివిగలవాడు. సోమయ్య చిన్న వాడు; అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతులబిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. సోమయ్య భార్య బీదయింటి పిల్ల. అందుచేత కొంచెం అణకువగా వుండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతాకాజేసి తాతలనాటి చిన్న పాతయిల్లూ, నాలుగెకరాల మెట్టచేను మాత్రం అతనికి యిచ్చాడు. పెద్దమేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం, సోమయ్య దాంతో నేతృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిం దాంట్లో తను కొంత తిని, మిగతాది ధర్మంచేస్తూ వుండేవాడు.

ఇలా వుండగా వొకనాటి రాత్రి ఎవరో సన్యాసి, రామయ్య యింట్ కొచ్చి తలుపుతట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి ” ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడ్తావు?” అని గద్దించాడు.

అప్పుడు సన్యాసి “బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరంపోతూ యిటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్లిపోతాను” అన్నాడు.

” ఏంటి, మాయింట్లో వల్లగాదు పో, పో. అదుగో, ఆ వున్నాడు షాహుకారు. వాడి దగ్గిరికి పో. దోవన యేసన్యాసిపోతున్నా పిలిచి అన్నం పెడతాడు.” అన్నాడు రామయ్య.

యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని యింట్లోకి తీసుకుపోయి, భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు.

సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసుర్తూ కూచున్నాడు.

సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యనూ అతని భార్యనూ పిలిచి “మీకు మూడు వరాలిస్తాను. కోరుకోండి” అన్నాడు.

సోమయ్య “స్వామీ, నాకు, నలుగురు ఇంటికివస్తే, ఉండటానికి పెద్ద యిల్లూ, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బూ యివ్వండి. అదిచాలు” అన్నాడు.

సోమయ్య పెళ్లాం “స్వామీ, నాకేమీ వద్దు; యితరులకు లేదనకుండా ధర్మం చెయ్యటానికి నాకు బుద్ధి పుట్టించు” అని రెండో వరం అడిగింది.

మూడో వరంగా, సోమయ్య “స్వామీ, మాకు యెప్పుడూ యితరులకు మేలు చెయ్యాలనే బుద్ధి వుండేట్టుగా వర మివ్వండి” అని అడిగాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని యింటి ముందు పెద్ద మేడవుంది. రామయ్య దబదబ పెళ్లాన్ని పిలుచుకుని మేడ దగ్గిరకి పరుగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడూ తమ్ముడి భార్యా వున్నారు. రామయ్య “యిది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

ఇక రామయ్య పెళ్లానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకు రమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది.

రామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంతదూరం పోయేవరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, రోజుతూ “స్వామీజీ! రాత్రి మావల్ల చాలా నేరం జరిగింది. ఈమాటు మా యింటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్యకూడా మిమ్మల్నితీసుకురమ్మన్నది” అని బ్రతిమాలాడు.

“బాబూ! ఏదో నాదోవను నేను తీర్థ యాత్రలకు పోతున్నాను; నేను రాలేను.” అన్నాడు సన్యాసి.

“అలాగైతే ఎట్లా స్వామీ ! నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన మూడు వరాలైనా ఇచ్చి వెళ్లండి.” అన్నాడు రామయ్య.

సన్యాసి రామయ్య వదలడని అనుకొని- “సరేలే నీకూ నువ్వుకోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తయి” అన్నాడు.

రామయ్య పట్టరాని సంతోషంతో, గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటి వేపుకు బయలుదేరాడు. గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ, భూమిమీద కాళ్లు ఆనకుండా దౌడుతీస్తున్నది.

యింతలో రామయ్యకి వొక దుర్బుద్ధి పుట్టింది. “గుఱ్ఱం ఇంత త్వరగా పరుగెత్తు తున్నదే వొకవేళ చచ్చిపోతే ఎట్లాగా ?” అనుకున్నాడు. అనుకోవటంతోటే, గుఱ్ఱం క్రిందపడి చచ్చింది.

రామయ్య గుఱ్ఱంతోపాటు కిందపడ్డాడు. పడి, లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుఱ్ఱాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుఱ్ఱాన్ని వొదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. ఐనా ఏమిచేస్తాడు. వెళ్లకతప్పదు. “గుఱ్ఱం చావనేచచ్చింది. ఈ జీను వొదిలి పెట్టటం ఎందుకా” అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు.

కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్లాం మాటలు విని యింత దూరం వచ్చినందుకు అతను విసుక్కు న్నాడు. విసుక్కుని “పాపమని, నన్ను యోగికోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం!” అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటీ వొక్కసారే జరిగినై.

రామయ్య మూడింట్లో రెండు వర్గాలు యిలా వూరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చు కుంటూ యింటికివచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునివున్నది. ఆమె నెత్తిమీద జీను ఆమె రామయ్యని చూడగానే మండి పడుతూ, ‘ఏమిటిదీ ? ఎట్లావచ్చింది నీ జీను నా. నెత్తిమీదికి ?” అని అడిగింది.

రామయ్య కప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ” ఇదుగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు వోర్పుగా జీను మోస్తూవుండు. మనదగ్గిర యింకోవరం మిగిలివున్నది. దీంతో మనం యేదైనా మంచివరం కోరుకుని ధనవంతులమయి హాయిగా వుందాం.” అన్నాడు.

ఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. ” నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీది జీను దించు. లేకపోతే బాగుండదు చెప్తున్నాను” అన్నది.

పాపం రామయ్య పెళ్ళానికి భయపడి “జీను వూడిపోవాలి” అని కోరుకున్నాడు. జీను వూడి క్రిందపడ్డది.

చూశారా! రామయ్య దుర్భుద్ధితో యింత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు యిట్లా మట్టిలో కలిసిపోయినై.

స్పందించండి